Share News

Is it a pond? చెరువేదీ?

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:53 PM

Is it a pond? ఎయిర్‌పోర్టు, రాబోతున్న బీచ్‌ కారిడార్‌, నేషనల్‌ హైవే ఉన్న భోగాపురాన్ని ఓ నిధిగా భావిస్తున్న అక్రమార్కులు ఎక్కడ ఖాళీ భూమి దొరుకుతుందా... కాజేద్దామా.. అని కాసుకూర్చుంటున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి జాతీయ రహదారి వరకూ దేనినీ వదలడం లేదు. తాజాగా హైవే పక్కనున్న చెరువును మాయం చేసేశారు.

Is it a pond? చెరువేదీ?
జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అప్పలరాజు చెరువును పూడ్చేసి చదును చేసిన దృశ్యం

చెరువేదీ?

జాతీయరహదారి ఆనుకొని ఉన్న చెరువు కబ్జా

విలువ సుమారు రూ.10కోట్లు

అమ్మకానికి ప్రయత్నాలు

భూ దందాను పట్టించుకోని రెవెన్యూ

ఎయిర్‌పోర్టు, రాబోతున్న బీచ్‌ కారిడార్‌, నేషనల్‌ హైవే ఉన్న భోగాపురాన్ని ఓ నిధిగా భావిస్తున్న అక్రమార్కులు ఎక్కడ ఖాళీ భూమి దొరుకుతుందా... కాజేద్దామా.. అని కాసుకూర్చుంటున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి జాతీయ రహదారి వరకూ దేనినీ వదలడం లేదు. తాజాగా హైవే పక్కనున్న చెరువును మాయం చేసేశారు. అమటాం రాయవలస పంచాయతీ నారుపేట గ్రామ సమీప జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సుమారు రూ.10కోట్లు విలువ చేసే చెరువును మట్టి, గ్రావెల్‌తో పూడ్చేసి అమ్మకానికి కూడా ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఈ భూ దందాను రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో వారికే తెలియాలి.

భోగాపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):

ఓ పక్క చురుగ్గా నిర్మాణమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం మరో పక్క రాబోతున్న బీచ్‌ కారిడర్‌, ఇంకో వైపు నేషనల్‌ హైవేతో భోగాపురం దశ మారుతోంది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని భూముల ధరలు సైతం ఊహాతీతంగా పెరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు ఖాళీ ప్రభుత్వ భూములపై పడుతున్నారు. దర్జాగా పాగా వేసి అమ్మకాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో శ్మశాన వాటికలు, చెరువులు, గెడ్డలు, వాగులు, పంట కాలువలు సైతం పూడ్చేసి ఆక్రమించుకొంటున్నారు. ఈ వ్యవహారాల్ని నిరంతరం గ్రామాల్లో పర్యటించే రెవెన్యూ అధికారులు, సిబ్బంది చూస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు.

అమటాం రాయవలస పంచాయతీ నారుపేట గ్రామ సమీపంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నెంబరు 11/1లో ఎకరా 79 సెంట్ల విస్తీర్ణంతో అప్పలరాజు చెరువు ఉండేది. ఈ చెరువును కొంత కాలంగా ఆక్రమించుకొంటూ వస్తున్నారు. చెరువులో చెత్త వేయడం, పనికిరాని వస్తువులు పడేయడం, ఉపయోగ పడని గృహ నిర్మాణ సామగ్రి తదితర వాటిని పడేస్తూ చెరువును ఆక్రమించుకొంటు వచ్చారు. రెండు రోజుల క్రితం చెరువులోకి పూర్తిగా మట్టి తరలించి పూడ్చేసి చదును చేసేశారు. జాతీయ రహదారిని ఆనుకొని ఆక్రమణకు గురైన చెరువు విలువ సుమారు రూ.10కోట్లకు పైగా ఉంటుంది. చెరువును పూడ్చేసి అమ్మకాలకు పెట్టినట్లు సమాచారం. ఇదంతా నిరంతరం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్న జాతీయరహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో జరగడం గమనార్హం. ఇదే రహదారిలో నిత్యం రాకపోకలు సాగిస్తున్న రెవెన్యూ శాఖకు ఎందుకు కనిపించలేదో అర్థంకావడం లేదు. ఇదంతా గతంలో వైసీపీలో ఉన్న ఓ నాయకుడు చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. హైవేను ఆనుకొని ఉన్న చెరువును పూడ్చేస్తే చూడని అధికారులు మిగతా ప్రాంతాల్లో ఏవిధంగా గుర్తించగలరంటూ స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్లే జాతీయరహదారిని ఆనుకొని ఉన్న శ్మశానవాటికను కూడా ఆక్రమించుకొంటున్నారని పలువురు చెబుతున్నారు. చెరువు ఆక్రమణపై తహసీల్దార్‌ రమణమ్మను వివరణ కోరగా ఆక్రమణను పరిశీలించి కారకులపై తగిన చర్యలు తీసుకొంటామన్నారు.

-----------

Updated Date - Sep 22 , 2025 | 11:53 PM