Irrigation Water ఇక శివారుకు సాఫీగా సాగునీరు
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:14 PM
Irrigation Water to Flow Smoothly to the Outskirts తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని కుడి ప్రధాన కాలువపై ప్రభుత్వం దృష్టి సారించింది. దాని పరిధిలో పిచ్చి మొక్కలు, పూడికతీతలతో పాటు రాళ్లు తొలగింపునకు రూ. 2.93 కోట్లు మంజూరు చేసింది.
పనులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
గరుగుబిల్లి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని కుడి ప్రధాన కాలువపై ప్రభుత్వం దృష్టి సారించింది. దాని పరిధిలో పిచ్చి మొక్కలు, పూడికతీతలతో పాటు రాళ్లు తొలగింపునకు రూ. 2.93 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిధిలో భాగంగా నిధులు కేటాయించగా.. ఉల్లిభద్ర పరిధిలోని జీరో కిలో మీటరు నుంచి తెర్లాం పరిధిలోని 48వ కిలో మీటరు వరకు కాలువ అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్వతీపురం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది పనుల నిర్వహణలో అధికారులు నిమగ్నమయ్యారు. నీరు దిగువకు రాకుండా ప్రధాన కాలువ పరిధిలో అడ్డంగా మట్టి వేశారు. గుర్రపు డెక్కతో పాటు పిచ్చి మొక్కల పనులు ప్రారంభం కావడంతో రానున్న ఖరీఫ్‌కు సాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ప్రాజెక్టు జేఈ బి.కిషోర్‌కుమార్ తెలిపారు. పనుల నిర్వహణకు టెండర్లు ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురవడంతో కొంతమేర పనులకు ఆటంకం నెలకొందని తెలిపారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఉల్లిభద్ర ప్రాంతంలో కుడి ప్రధాన కాలువను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కాలువల అభివృద్ధిని పట్టించుకోలేదు. కనీసం వాటి నిర్వహణకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో పూడికలు, పిచ్చి మొక్కలతో కాలువలు అధ్వానంగా మారాయి. ఈ క్రమంలో దిగువ ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. కాలువ గుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసిన సమయంలో పలు ప్రాంతాల్లో గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించడంతో ఆయకట్టుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.