Farmers సాగు పరికరాలు రైతులందరికీ ఉపయోగపడాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:27 PM
Irrigation Equipment Should Benefit All Farmers ప్రభుత్వ రాయితీతో పొందిన వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులందరికీ ఉపయోగపడాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో సాగు పరికరాలు, రాయితీ నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
పార్వతీపురం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాయితీతో పొందిన వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులందరికీ ఉపయోగపడాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో సాగు పరికరాలు, రాయితీ నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.514.09 లక్షల విలువైన యంత్ర పరికరాలను 50 శాతం రాయితీతో రూ.227.72 లక్షలకు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. లాభసాటి పంటలైన మొక్కజొన్న కందులు, చిరుధాన్యాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. వ్యవసాయ విధానాలు, శ్రీవరిసాగు, చిరుధాన్యాలు, కంది, ప్రకృతి వ్యవసాయంపై ఉత్తమ రైతులతో మిగతా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అనంరతం 920 మంది చిన్న, సన్నకారు, గిరిజన రైతులకు రూ.2.27 కోట్ల రాయితీ నిధుల చెక్కును అందించారు. కందులు, ఎంటీయూ 1426 సన్నరకం వరి విత్తనాలు, మినీ కిట్లును రైతులకు పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్ మాట్లాడుతూ.. కర్షక్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి వ్యవసాయ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. వ్యవసాయ పరికరాలను రైతు సేవా కేంద్రాల వద్దే అన్నదాతలకు అందించినట్టు తెలిపారు. పరికరాలకు మరమ్మతులు, సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఆగ్రో సంస్థ జిల్లా మేనేజర్ శంకర్‌బాబుకు సూచించారు. రాయితీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.
డయేరియా మరణాలు సంభవించరాదు..
జిల్లాలో డయేరియా మరణాలు సంభవించరాదని, ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 31వ తేఈ వరకు డయేరియా నివారణపై విస్తృతంగా అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు ఆ వ్యాధితో మృత్యువాతపడరాదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల వద్ద ఓఆర్‌ఎస్, జింక్ కార్నర్లు అందుబాటులో ఉంచాలన్నారు. డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహన్‌రావు, ఎం.వినోద్‌కుమార్, డీఈవో బి.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యాధి నివారణపై పోస్టర్లు విడుదల చేశారు.