Technology సాంకేతికతతో కేసుల దర్యాప్తు
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:04 PM
Investigation of Cases through Technology సాంకేతికతతో దర్యాప్తు చేపట్టి త్వరితగతిన కేసులను పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. శనివారం పోలీస్ సమావేశ మందిరం నుంచి పోలీస్ అధికారులు, సిబ్బందితో వర్చువల్‌గా నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
బెలగాం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సాంకేతికతతో దర్యాప్తు చేపట్టి త్వరితగతిన కేసులను పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. శనివారం పోలీస్ సమావేశ మందిరం నుంచి పోలీస్ అధికారులు, సిబ్బందితో వర్చువల్‌గా నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ పెండింగ్ కేసుల విషయంలో కీలక ఆధారాలు సేకరించి.. అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకోవాలి. చార్జ్ షీట్స్‌ను కోర్టుకు సమర్పించాలి. గంజాయి, సారా, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయాల్సి ఉంది. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, ధర్నాలకు పోలీస్ స్టేషన్‌లో అనుమతి పత్రం తీసుకోవాల్సిందే. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలి. హెల్మెట్ ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రతా నిబంధనులు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలి.’ అని తెలిపారు. శిక్షణ ఐజీ కేవీ మోహన్‌రావు మాట్లాడుతూ.. కళాశాలల పరిధిలో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ర్యాగింగ్ పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేయాలన్నారు. పొక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలు, శక్తి యాప్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.