మహిళ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:51 AM
వియ్యంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన దూది రాము(59) అనే మహిళ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మర చేస్తున్నారు.
- ఇంకా నిర్వహించని పోస్టుమార్టం
కొత్తవలస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వియ్యంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన దూది రాము(59) అనే మహిళ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మర చేస్తున్నారు. శవ పంచనామా ప్రక్రియ పూర్తయ్యేసరికి శనివారం సాయంత్రం అయింది. దీంతో రాము మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శృంగవరపుకోట ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైంది. అయితే, ఆదివారం సెలవు దినం కావడంతో పోస్టుమార్టం జరగలేదు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. రాము హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఆమెను బంగారం కోసమే హత్య చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనుమానితులను గుర్తించి వారిని తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఈ హత్యను తెలిసిన వారే చేశారనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో కేసును ఛేదిస్తామని చెబుతున్నారు.