Share News

కోనమసివానిపాలెం ‘ఉపాధి’ ఎఫ్‌ఏపై విచారణ

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:28 AM

మండలంలోని కోనమసివానిపాలెం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బండ అప్పారావుపై జిల్లా అధికారులు శనివారం విచారణ చేపట్టారు.

కోనమసివానిపాలెం ‘ఉపాధి’ ఎఫ్‌ఏపై విచారణ
ఎఫ్‌ఏపై విచారణ జరుపుతున్న జిల్లా అధికారులు

- దొంగ మస్తర్లతో కాజేసిన నిధులు

- రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు

- విచారణ సమయంలో ఎఫ్‌ఏ వర్గీయుల గొడవ

- పోలీసుల రంగప్రవేశం

లక్కవరపుకోట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనమసివానిపాలెం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బండ అప్పారావుపై జిల్లా అధికారులు శనివారం విచారణ చేపట్టారు. దొంగ మస్లర్లతో ఉపాధి నిధులు కాజేసినట్లు ఎప్‌ఏ అప్పారావుపై అదే గ్రామానికి చెందిన కాకర శ్రీనివాసరావు గత నెలలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏపీడీ రమామణి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. 2012 నుంచి ఇప్పటి వరకూ సుమారు కోటి రూపాయల నిధుల వరకు అవకతవకలు జరిగాయని, 39 మంది కూలీలు పని చేయకుండానే, వారిపేరున మస్తర్లు వేసి ఎఫ్‌ఏ అప్పారావు సొమ్ము డ్రా చేశాడని ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు సాక్ష్యాధారాలను అధికారుల ముందుకు తీసుకొచ్చే సమయంలో ఎఫ్‌ఏ వర్గీయులు గొడవకు దిగారు. విచారణ అధికారులకు సహకరించకుండా గందరగోళం సృష్టించారు. వారిని గట్టిగా హెచ్చరిస్తూ కేకలు వేయడంతో అధికారులు భయపడిపోయారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ వారిని అదుపు చేయలేకపోవడంతో, అధికారుల ఎస్‌ఐకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి తగాదా పడుతున్నవారిని చెదరగొట్టారు. అనంతరం మళ్లీ విచారణ చేపట్టగా, ఎప్‌ఏ వర్గీయులు మరోసారి గొడవకు సిద్ధమవడంతో అధికారులు వెనుదిరిగారు. మరోమారు విచారణ చేపడతామని, ముందస్తుగా సమాచారం ఇచ్చి ఎక్కువ మంది పోలీసు రక్షణతో 144 సెక్షన్‌ పెట్టి విచారణ చేస్తామని ఏపీడీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డీబీటీ మేనేజర్‌ హాసిఫ్‌ హుస్సేన్‌, సీఎల్‌ఆర్సీ ఏపీడీ చిన్నంనాయుడు, ఏపీవో విజయలక్ష్మి, వీరలక్ష్మి, టీఏలు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:29 AM