Into the Public from the 2nd... 2 నుంచి జనంలోకి ..
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:36 PM
Into the Public from the 2nd... వచ్చే నెల 2నుంచి ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టాలని.. కూటమి శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలపై చర్చించారు.
సరికొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం
ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు
అభివృద్ధి , సంక్షేమంపై విస్తృత ప్రచారం
ఏడాది పాలన విజయాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
జిల్లా నేతలు సన్నద్ధం
పార్వతీపురం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 2నుంచి ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టాలని.. కూటమి శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని, నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గడపకూ వెళ్లాలని స్పష్టం చేశారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు సన్నద్ధమవుతున్నారు. సాలూరు, పార్వతీపురం, కురపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లో బుధవారం నుంచి ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు నెల రోజుల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయనున్నారు. కాగా అమరావతిలో నిర్వహించిన సమావేశానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హాజరయ్యారు.
అమలు చేసిన సంక్షేమ పథకాలు
కూటమి ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రధానంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, ఉచిత విసుక విధానం, ‘తల్లికి వందనం’, అన్నదాతా సుఖీభవ, దీపం-2 కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు , మైదాన, గిరిజన ప్రాంతాల్లో బీటీ, సీసీ రహదారులు, గోశాలల నిర్మాణం , గిరిశిఖర గ్రామాల్లో కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలన్నింటినీ కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంది.
విజయవంతంగా నిర్వహిస్తాం
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో అన్ని మండలాల్లో జూలై 2 నుంచి ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య్రకమాలను పూర్తిస్థాయిలో వివరిస్తాం.
- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి