Intermediate Education… ఇంటర్ విద్య.. గాడిన పడేనా?
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:36 PM
Intermediate Education… Will it Collapse? జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారింది. మౌలిక వసతులకు ఏ ఇబ్బందీ లేకపోయినా.. బోధన, భోధనేతర సిబ్బంది కొరత మాత్రం తీవ్రంగా ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఆయా పోస్టులను మంజూరు చేయడం లేదు. దీంతో ఉన్న వారిపై పనిభారం అధికమవుతోంది. మరోవైపు విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
తీవ్రంగా బోధనేతర సిబ్బంది కొరత
పోస్టులు భర్తీ చేయని వైనం
ఇదీ జూనియర్ కళాశాలల్లో పరిస్థితి
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
జియ్యమ్మవలస, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారింది. మౌలిక వసతులకు ఏ ఇబ్బందీ లేకపోయినా.. బోధన, భోధనేతర సిబ్బంది కొరత మాత్రం తీవ్రంగా ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఆయా పోస్టులను మంజూరు చేయడం లేదు. దీంతో ఉన్న వారిపై పనిభారం అధికమవుతోంది. మరోవైపు విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో లెక్చరర్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. జిల్లా పరిధిలోని సీతంపేట, గరుగుబిల్లి మండ లాల్లో మినహా మిగిలిన చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పాలకొండ మండ లంలో మాత్రం బాలురు, బాలికలకు వేర్వేరుగా కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 3,288 మంది బాలురు, 2,202 మంది బాలికలు విద్యనభ్య సిస్తున్నారు. మన్యంలో ఉన్న 14 ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో కాంట్రాక్టు ఫ్యాకల్టీ (సీఎఫ్) మొత్తం 140 మంది ఉండగా, రెగ్యులర్ లెక్చరర్లు కేవలం 27 మందే. వారితో పాటు గెస్ట్ ఫ్యాకల్టీ 12 మంది, ఒక ఎంటీఎస్ లెక్చరర్ ఉన్నారు. అయితే ఇంకా 12 లెక్చరర్ పోస్టులు ఖాళీ. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కొరవడింది.
బోధనా సిబ్బంది ఇలా..
పార్వతీపురం, పాలకొండ (బాలురు) జూనియర్ కళాశాలల్లో మాత్రమే ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) పనిచేస్తున్నారు. బలిజిపేట, కొమరాడ, పార్వతీపురం, పాలకొండ (బాలురు), సాలూరులోని కళాశాలల్లో మాత్రమే రెగ్యులర్ లైబ్రేరియన్లు పనిచేస్తున్నారు. మిగిలిన తొమ్మిది చోట్ల ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఎవరో ఒక లెక్చరరు ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోంది. భామిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, సివిక్స్, హిస్టరీ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చినమేరంగిలో సివిక్స్, వీరఘట్టంలో జువాలజీ, పాచిపెంటలో గణితం, పార్వతీపురం, పాలకొండ (బాలురు)లో తెలుగు లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బోధనేతర సిబ్బంది పరిస్థితి ఇదీ..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులకు గత పదిహేనేళ్లుగా భర్తీ చేయడం లేదు. కళాశాల సూపరింటెండెంట్, క్లాస్-4 ఉద్యోగులు ఎక్కడా లేదు. ఒక్కో కళాశాలకు ముగ్గురు ఆఫీసు సబార్డినేట్‌లు ఉండాలి. కానీ గుమ్మలక్ష్మీపురంలో ఒకరు మాత్రమే పని చేస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్లు కూడా ముగ్గురేసి ఉండాలి. అయితే 37 మందికి 16 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరు చోట్ల టైపిస్ట్ పోస్టులు మంజూరు లేదు. పార్వతీ పురంలో కళాశాలలో మాత్రమే ఒకరు పనిచేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూని యర్ అసిస్టెంట్లు పరిస్థితి అదేవిధంగా ఉంది. ఆరు కళాశాలల్లో మాత్రమే సీనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. మిగిలిన ఎనిమిది కళాశాలల్లో ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వం దృష్టిలో ఉంది
జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.
- వై.నాగేశ్వరరావు, డీఐఈవో