interest on police postపోలీస్‌పైనే మక్కువ
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:02 AM
interest on police post పాతబగ్గాం గ్రామం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఆ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఉద్యోగాలు సాధించారు. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే గ్రామానికి చెందిన 15 మంది పోలీస్ వృత్తిలో స్థిరపడ్డారు.
పోలీస్‌పైనే మక్కువ
పాత బగ్గాం నుంచి తాజాగా ఐదుగురు కానిస్టేబుళ్లు
ఒకే గ్రామంలో 16 మంది పోలీసులు
కొద్ది సంత్సరాల వ్యవధిలోనే ఎంపిక
గజపతినగరం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి):
పాతబగ్గాం గ్రామం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఆ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఉద్యోగాలు సాధించారు. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే గ్రామానికి చెందిన 15 మంది పోలీస్ వృత్తిలో స్థిరపడ్డారు. ఈ గ్రామ అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నారు. కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో కొద్ది నెలల పాటు ఉండి శారీరక సామర్థ్యాన్ని పెంచుకుంటూ చదువుతున్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికే దాదాపు శిక్షణను పూర్తి చేసుకుని సిద్ధమవుతున్నారు. గ్రామంలో కొద్ది సంవత్సరాల వ్యవధిలో 11మంది పోలీసు కొలువులు సాధించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆగస్టునెలలో చేపట్టిన పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు ఎపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. రాజమండ్రి ఏపి ఎస్పీ కానిస్టేబుల్‌గా సంగంరెడ్డి గణేష్, ప్రకాశం జిల్లా ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా కడమల దినేష్, చిత్తూరు జిల్లా ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా సంగంరెడ్డి హేమంత్, విజయనగరం జిల్లా సివిల్ కానిస్టేబుల్‌గా కుమలి ధనంజయ్, తగరంపూడి పవన్‌కల్యాణ్‌లు పోలీస్ ఉద్యోగాలు సాధించారు. ఈనెల16న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. గజపతినగరం మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో సుమారు 32మంది వివిధ కేటగిరిల్లో పోలీసు ఉద్యోగాల్లో ఉండగా ఒక్క పాతబగ్గాం గ్రామంలోనే 16మంది యువకులు పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నారు.
స్నేహితులే స్ఫూర్తిగా
గ్రామంలోని యువత తమ స్నేహితులనే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అప్పటికే ఎంపికైన వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని వారి మార్గంలో పయనిస్తున్నారు. ఒకరికొకరు ఆర్థిక ఆసరా కూడా అందించుకుంటూ ముందుకెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు.