Integrated Steel Plant in Kella కెల్లలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:01 AM
Integrated Steel Plant in Kella గుర్ల మండలం కెల్ల గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కానుంది. ముందుకొచ్చిన సూపర్ స్మెల్టెర్స్ లిమిటెడ్‌కు ప్రభుత్వం 1,085 ఎకరాలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ రూ.8,570.50 కోట్లతో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయనుంది. తద్వారా 750 మందికి ఉపాధి కలగనుంది.
కెల్లలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్
1085 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
రూ.8570 కోట్లతో ఏర్పాటు చేయనున్న సూపర్ స్మెల్టెర్స్
గుర్ల ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశం
గుర్ల, నవంబరు 15(ఆంరఽధజ్యోతి): గుర్ల మండలం కెల్ల గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కానుంది. ముందుకొచ్చిన సూపర్ స్మెల్టెర్స్ లిమిటెడ్‌కు ప్రభుత్వం 1,085 ఎకరాలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ రూ.8,570.50 కోట్లతో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయనుంది. తద్వారా 750 మందికి ఉపాధి కలగనుంది. టౌన్ షిప్ ఏర్పాటుకు మరో 97.04 ఎకరాలు, రైల్వే సైడింగుకు 53.35 ఎకరాలు కూడా కేటాయించనున్నారు. రెండు దశల్లో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో పెద్ద మండలంగా ఉన్న గుర్లలో ఉపాధి అవకాశాలు లేక వెనుకబడి ఉంది. 47 పంచాయతీలు, 52 గ్రామాలు ఉన్నప్పటికీ సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు వలసబాట పడుతున్నారు. ఇంకోవైపు నీటి వనరులు ఉన్నప్పటికీ వాటినీ పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గడిగడ్డ రిజర్వాయర్ అభివృద్ధికి నోచుకోలేదు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు అతిగతీలేదు. మెరకముడిదాం మండలం సరిహద్దుల్లో ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలు ఉన్నప్పటికీ సరిగా పనిచేయడం లేదు. ఈ ప్రాంతవాసులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. చాలా వరకు విజయనగరం, విశాఖపట్టణా లకు వలస వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు అడుగు పడడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కాగా ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ కోసం ఎస్‌ఎస్‌ఆర్.పేట, సోలిపి, సోమరాజుపేట, మన్యపురిపేట, బెల్లానపేట, దమరసింగి గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ గ్రామాల్లో మాత్రమే భూములను ప్రభుత్వం సేకరించింది.
తహసీల్దార్ ఏమన్నారంటే...
తహసీల్దార్ ఆదిలక్ష్మీ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్.పేట నుంచి కొండప్రాంతాల్లో భూమిని సర్వే చేశామని, కెల్ల రెవెన్యూకు సంబంధించిన విస్తీర్ణం ఎక్కువగా ఉందన్నారు. 1080 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపిందని, ల్యాండ్ సర్వే చేసి రిపోర్టు అందించాలని అధికారులు చెప్పడంతో తాము సర్వేచేసి అప్పగించినట్లు తెలిపారు. మిగతా విషయాలు తమకు తెలిదన్నారు.
-----------------------