Share News

Instructors to teach బోధనకు ఇన్‌స్ట్రక్టర్లు

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:41 PM

Instructors to teach ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Instructors to teach బోధనకు ఇన్‌స్ట్రక్టర్లు

బోధనకు ఇన్‌స్ట్రక్టర్లు

5 నెలల కాలానికి నియామకం

ఈ నెల 7 వరకూ దరఖాస్తుల ఆహ్వానం

9వ తేదీ నుంచి విధులు

ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట భర్తీ

రాజాం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను అందుబాటులోకి తేనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1146 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సబ్జెక్టు టీచర్లతో పాటు ఎస్‌జీటీలను సైతం నియమించనుంది. వారి వేతనాలను సైతం ఖరారు చేసింది. ఈ నెల 7లోగా దరఖాస్తులివ్వాలని పేర్కొంది. ఈ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. గతంలో విద్యావలంటీరు పేరుతో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు. ఈసారి అడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు.

మెగా డీఎస్సీలో భాగంగా ఇటీవల కొత్త ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి లాంగ్వేజ్‌ పండిట్స్‌ 45, స్కూల్‌ అసిస్టెంట్‌ 179, సెకెండరీ గ్రాడ్యుయేట్‌ టీచర్లు 149..మొత్తం 373 పోస్టులు భర్తీ చేశారు. కానీ 583 వరకూ ఖాళీలు చూపించారు. ఇందులో 373 మాత్రమే భర్తీ చేయడంతో 210 వరకూ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఉన్నచోట, ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని కొత్తగా అడకమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన 5 నెలలు మాత్రమే వీరు విధుల్లో ఉంటారు. మే 7 వరకూ కొనసాగనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే వీరి నియామకం జరగనుంది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లకు రూ.12,500, ఎస్‌జీటీలకు రూ.10 వేలు పారితోషికంగా అందిస్తారు. ఈ ఐదు నెలల కాలానికి పారితోషికాలకుగాను ప్రభుత్వం రూ.8.21 కోట్లను సమగ్ర శిక్షకు కేటాయించింది. జిల్లాలో ఎక్కువగా హిందీ స్కూల్‌ అసిస్టెంట్లు, తెలుగు స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలను ఇన్‌స్ట్రక్టర్లతో భర్తీ చేయనున్నారు.

ఫ కేవలం మే 7 వరకూ.. 5 నెలల కాలంపాటే వీరు విధుల్లో ఉంటారు. అయితే అప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్‌ రాకుంటే మాత్రం వచ్చే విద్యాసంవత్సరంలో కూడా వీరినే కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. మండలంలో ఖాళీలపై ఎంఈవో ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ నెల 7 వరకూ దరఖాస్తులకు గడువు ఉంది. 8న భర్తీ చేస్తారు. 9 నుంచి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.

వెంటనే దరఖాస్తు చేసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 5 నెలల కాలానికి మాత్రమే వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఉత్తమ విద్యాబోధన అందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం

-------------

Updated Date - Dec 03 , 2025 | 11:41 PM