స్ఫూర్తిమంత్రం.. వందేమాతరం
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:45 PM
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ కాంక్షను రగిల్చిన ‘వందేమాతరం’ గీతానికి శుక్రవారంతో150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత వెల్లివిరిసింది.
విజయనగరంక్రైం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ కాంక్షను రగిల్చిన ‘వందేమాతరం’ గీతానికి శుక్రవారంతో150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత వెల్లివిరిసింది. కార్యాలయాలు, పాఠశాలల్లో వందేమాతరం గీతం మార్మోగింది. విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. విద్యార్థులు 150 సంఖ్య రూపంలో కూర్చొని ప్రత్యేక ప్రదర్శనలు చేపట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తినింపిన గేయం ‘వందేమాతరం’ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కోట కూడలి, పోలీస్ సంక్షేమ పాఠశాల పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, డీపీవో ఏవో శ్రీనివాసరావు, సీఐలు, ఆర్‌ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.