Ashram and Gurukul Schools ఆశ్రమ, గురుకుల పాఠశాలల పరిశీలన
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:23 AM
Inspection of Ashram and Gurukul Schools అనారోగ్య కారణాలతో ఇటీవల జిల్లాలో గిరిజన విద్యార్థులు మరణించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు గురువారం సాలూరు మండలంలో అంబేడ్కర్ గురుకులం, మామిడిపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలను డీఈవో బి.రాజకుమార్ సందర్శించారు.
సాలూరు రూరల్, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణాలతో ఇటీవల జిల్లాలో గిరిజన విద్యార్థులు మరణించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు గురువారం సాలూరు మండలంలో అంబేడ్కర్ గురుకులం, మామిడిపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలను డీఈవో బి.రాజకుమార్ సందర్శించారు. వంట గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. బొడ్డవలస గురుకులంలో వంట చేసే వారి తల, చేతులకు గ్లౌజులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. మామిడపల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న ఇద్దరు అంటివలస గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, మామిడిపల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం మామిడిపల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్డి, తాగునీరు తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్‌ఎం సీతారాం, ఇతరు ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఏటీడబ్ల్యూవో సందర్శన
మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, తోణాం, మావుడి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలను గురువారం ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి సందర్శించారు. మూడు ఆశ్రమ పాఠశాలల్లో భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ, ఆర్వో ప్లాంట్లు తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు ఏ మాత్రం ఆరోగ్యం బాగోలేకున్నా.. వెంటనే వైద్యసేవలందించాలని సూచించారు.