when will action be taken? విచారణ సరే.. చర్యలెప్పుడు?
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:20 PM
Inquiry is fine… but when will action be taken? జిల్లాలోని కొమరాడ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై చర్యలు కానరావడం లేదు. విచారణ చేపట్టి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో సర్వత్రా విమర్వలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
పార్వతీపురం/కొమరాడ, నవంబరు2(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొమరాడ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై చర్యలు కానరావడం లేదు. విచారణ చేపట్టి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో సర్వత్రా విమర్వలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా కొమరాడ పంచాయతీలో రూ.30 నుంచి రూ.40 లక్షలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో ఆ పంచాయతీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అనేకసార్లు పీజీఆర్‌ఎస్‌లో కూడా వినతిపత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. జాప్యం చేస్తూ కాలం గడిపారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆగస్టు 13న జిల్లా పంచాయతీ అధికారి కొండలరావుతో పాటు ఇతర అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే నేటికీ బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పటికే నివేదిక సిద్ధమైతే కొంతమంది కార్యదర్శులతో పాటు సర్పంచ్ చెక్‌పవర్ కూడా రద్దు అయ్యేది. కానీ ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదంటే ఎవరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని పంచాయతీల్లో నిధులు దుర్విని యోగమైతే సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేసి, కార్యదర్శులను సస్పెన్షన్ చేశారు. కానీ కొమరాడలో మాత్రం ఎటువంటి చర్యల్లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై డీపీవో కొండలరావును వివరణ కోరగా.. ‘కొమరాడ పంచాయతీలో నిధుల దుర్విని యోగంపై విచారణ చేపట్టాం. దీనిపై నివేదిక తయారు చేస్తున్నాం. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.