వేతనాలు పెంచి...వేధింపులు అరికట్టండి
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:48 PM
తమ వేతనాలు పెంచాలని... రాజకీయ వేధింపులను అరికట్టాలని అంగన్‌వాడీ కార్యకర్తలు అందోళన చేపట్టారు.
- అంగన్‌వాడీల డిమాండ్
-కలెక్టరేట్ వద్ద నిరసన
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తమ వేతనాలు పెంచాలని... రాజకీయ వేధింపులను అరికట్టాలని అంగన్‌వాడీ కార్యకర్తలు అందోళన చేపట్టారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనాలను దారి మళ్లించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అనేక సేవలు అందిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 170 మంది మినీ వర్కర్లను ఇప్పటికీ మెయిన్ వర్కర్లుగా మార్చలేదన్నారు. సంక్షేమ పథకాలు తమకు వర్తించడం లేదని తెలిపారు. రాజకీయ ఒత్తిడి కారణంగా రాజాం ప్రాజెక్టులో నలుగురు హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వలేదని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని యాప్‌లు కలిపి ఒక యాప్‌గా మార్చాలని కోరారు. ప్రీ స్కూల్‌ను బలోపేతం చేయాలని...అక్కడి పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్ వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీనిపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పైడిరాజు, అనసూయ, లక్ష్మి, సీఐటీయూ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.