Income-generating crops should be cultivated. ఆదాయాన్నిచ్చే పంటలు పండించాలి
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:12 AM
Income-generating crops should be cultivated. ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి రైతులకు సూచించారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన బుధవారం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమం జరిగింది.
ఆదాయాన్నిచ్చే పంటలు పండించాలి
అధిక యూరియా వాడకంతో క్యాన్సర్
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి
శృంగవరపుకోట (వేపాడ), నవంబరు19(ఆంధ్రజ్యోతి):
ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి రైతులకు సూచించారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన బుధవారం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,25,700 మంది రైతులకు ఈ పథకంలో భాగంగా రెండో విడతగా రూ.159 కోట్లు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయన్నారు. ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేలను మూడు విడతులుగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆగస్టులో మొదటి విడతగా రూ.7వేలు, ఇప్పుడు రెండో విడతగా రూ.7వేలు, మేలో మూడో విడతగా రూ.6వేలు రైతుల ఖాతా జమ చేస్తారన్నారు. ఖరీఫ్, రబీతో పాటు దుక్కు దున్నేసమయంలో ఖర్చులకు పనికొస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు ఇస్తుంటే, వాటికి రూ.14వేలను రాష్ట్ర ప్రభుత్వం జతచేసి రూ.20 వేలను రైతులకు అందిస్తోందన్నారు. జిల్లాలో 80శాతం వరి పంట పండిస్తున్నారని, ఈ పంటతో పాటు అధిక లాభాలు వచ్చే పంటలను పండించేందుకు ముందుకు రావాలన్నారు. గంట్యాడ మండల పరిధిలో రవివర్మ అనే రైతు ఈ ఏడాది టమాటా పండించడం ద్వారా ఏడాదికి రూ.70వేల ఆదాయాన్ని పొందినట్లు క్షేత్ర స్థాయి పర్యటనలో తాను తెలుసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్‌లతో జరిగే ప్రతి సమావేశంలో రైతుల గురించి చర్చిస్తారని, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచనలు చేస్తారన్నారు. విజయనగరం కోనసీమ జిల్లాకంటే తగ్గకుండా వ్యవసాయ చేసేలా రైతులు ఆలోచనలు చేయాలన్నారు. అధికంగా యూరియా వాడుతుండడంతో భూమంతా రసాయనమయం అవుతుందన్నారు. దీనివల్ల నిశబ్దంగా క్యాన్సర్ వ్యాపిస్తుందని చెప్పారు. ఏపీ కంటే ముందు పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అధిక యూరియా వాడకంతో ఆ రెండు రాష్టా్ట్రల్లో 30శాతం మంది క్యాన్సర్ వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దీన్ని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు యూరియా వాడకం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సేంద్రియ, ఇతర ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలో 41,144 మంది రైతులు రూ.26.98 కోట్లు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం ద్వారా అందుకున్నారన్నారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, కొత్తవలస ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, పీఎసీఎస్ చైర్మన్‌లు జీ.ఎస్.నాయుడు, కోళ్ల శ్రీను, టీడీపీ మండల అధ్యక్షుడు డోకుల అచ్చంనాయుడు, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.