Share News

‘Shakti’! ఆపద వేళ.. ‘శక్తి’నిచ్చేలా!

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:36 PM

In Times of Crisis... Empowering ‘Shakti’! మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చే దిశగా పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే మహిళలు తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకునేలా శక్తి యాప్‌ను రూపొందించింది. ఫిర్యాదుల పద్ధతిని సులభతరం చేసి.. మహిళలకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

  ‘Shakti’!  ఆపద వేళ.. ‘శక్తి’నిచ్చేలా!
జెండా ఊపి శక్తి వాహనాలను ప్రారంభిస్తున్న ఎస్పీ

  • సులభ పద్ధతిలో ఫిర్యాదుకు కొత్త యాప్‌

  • జిల్లాలో మూడు శక్తి బృందాల ఏర్పాటు

  • ఇప్పటికే ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌, డ్రాప్‌బాక్స్‌లు

  • ఎస్పీ పర్యవేక్షణలో సమస్యలకు పరిష్కారం

పార్వతీపురం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చే దిశగా పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే మహిళలు తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకునేలా శక్తి యాప్‌ను రూపొందించింది. ఫిర్యాదుల పద్ధతిని సులభతరం చేసి.. మహిళలకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇకపై ప్రతీ మహిళా ఓ శక్తిగా మారేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యాప్‌ను సిద్ధం చేసింది. మహిళలు ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఎటువంటి ఆపద వచ్చినా దీనిద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే చాలు.. తక్షణమే వారు అక్కడకు చేరుకుని రక్షణ కల్పిస్తారు. జిల్లాలోని ప్రతీ ఆటో, దాని డ్రైవర్‌ వివరాలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఓ యాప్‌లో పొందుపరచనున్నారు. దీనికి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ను ఆటోలో ముద్రిస్తారు. మహిళలు ఆటోలో ప్రయాణించే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే.. శక్తి యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. ఆ ఆటో ఎక్కడికి వెళ్తుంది.. ఎవరు నడుపుతున్నారనే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారాన్ని శక్తి యాప్‌ ద్వారా తల్లిదండ్రులతోపాటు పోలీసులకు పంపించవచ్చు. తద్వారా మహిళలకు పోలీసు శాఖ భద్రత కల్పించనుంది. అలాగే వేధింపులు, ర్యాగింగ్‌లు తదితర వాటిపైనా నేరుగా ఈ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. జిల్లాలోని మూడు శక్తి బృందాలను సిద్ధం చేశారు.

ఇప్పటికే ప్రతీస్టేషన్‌లో ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌

జిల్లాలో ఉన్న 36 పోలీసుస్టేషన్లలో త్వరలో ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఓ మహిళా కానిస్టేబుల్‌ కేవలం మహిళ బాధితుల నుంచి మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ వివరాలను ఎస్‌హెచ్‌ఓలకు వివరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారు. దీంతో మహిళలు అభద్రతాభావంతో చెప్పుకోలేని కొన్ని ఫిర్యాదులను మహిళా పోలీసులకు చెప్పుకునేందుకు అవకాశం కల్గుతుంది.

పాఠశాల, కళాశాలలో డ్రాప్‌బాక్స్‌లు

మహిళల చిత్రాలను మార్ఫింగ్‌ చేసి.. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. బాధితులను బెదిరించి సొమ్ము చేసుకునే నేరాలు పెరిగిపోయాయి. విద్యార్థినుల భద్రతలో భాగంగా ప్రతీ పాఠశాల, కళాశాలలో పోలీసులు ‘సంకల్పం’ పేరిట ‘డ్రాప్‌బాక్స్‌’లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. శక్తి బృందం, సమీప స్టేషన్‌ సిబ్బంది వాటిని పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటిని నేరుగా ఎస్పీ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

రంగంలోకి శక్తి టీం వాహనాలు

బెలగాం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మహిళల రక్షణకు శక్తి టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం శక్తి టీం వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఒక్కో టీమునకు ఐదుగురు చొప్పున 15 మందితో మూడు బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లా కేంద్రంలో ఒకటి, పాలకొండలో ఒకటి, సాలూరులో ఒకటి ఉంటాయి. డ్రాప్‌ బాక్సులను ఇప్పటికే ఏర్పాటు చేశాము. శక్తి బృందంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది ఉంటారు. ఇప్పటికే డ్రాప్‌ బాక్సులను ఏర్పాటు చేశాం. ఒక్కో వాహనానికి ఏఎస్‌ఐ నాయకత్వం వహిస్తారు. కళాశాలలు, ముఖ్య కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ టీంలు సంచరిస్తూ మహిళలకు రక్షణగా ఉంటాయని వెల్లడించారు. ఆపద సమయంలో మహిళలు ఘటనా స్థలం నుంచి 112 లేదా 100 నెంబర్‌కు ఫోన్‌ చేసినా, శక్తి యాప్‌ ద్వారా మెసేజ్‌ ఇస్తే.. వెంటనే ఈ టీం అక్కడకు చేరుకుంటుందని తెలిపారు. శక్తి యాప్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, వారి మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, శక్తి టీమ్స్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - Mar 14 , 2025 | 11:36 PM