elephants పగలంతా తోటల్లో.. సాయంత్రం జనావాసాల్లోకి..
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:57 PM
In the Orchards by Day… Into Habitations by Evening భామిని మండలం తాలాడలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. పగలంతా తోటల్లోనే ఉంటూ.. సాయంత్రం జనావాసాల్లోకి హడలెత్తిస్తున్నాయి. గురువారం రాత్రి ఆ గ్రామంలోని 28 మొక్కజొన్న గింజల బస్తాలను చిందరవందర చేశాయి.
భయాందోళనలో గ్రామస్థులు
భామిని, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): భామిని మండలం తాలాడలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. పగలంతా తోటల్లోనే ఉంటూ.. సాయంత్రం జనావాసాల్లోకి హడలెత్తిస్తున్నాయి. గురువారం రాత్రి ఆ గ్రామంలోని 28 మొక్కజొన్న గింజల బస్తాలను చిందరవందర చేశాయి. దీంతో ఆ రైతు లబోదిబోమంటున్నాడు. 15 రోజులుగా ఏనుగులు ఆ ప్రాంతంలోనే సంచరిస్తుండడంతో తాలాడ, ఘనసర, కీసర, కోసలి గ్రామస్థులు సాయంత్రం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రైతులు పొలం పనులకు కూడా వెళ్లలేకపోతున్నారు. ఏ క్షణాన ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
చినగుడబలో ...
గరుగుబిల్లి: గరుగుబిల్లి మండలంలో ఉన్న గజరాజుల గుంపు కూడా స్థానికులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజులుగా గొట్టివలస, దళాయివలస, తులసిరామి నాయుడు వలస, తదితర గ్రామాల్లో సంచరించిన ఏనుగులు శుక్రవారం చినగుడబకు చేరుకున్నాయి. పిల్లవాని చెరువులో ప్రత్యక్షమవ్వడంతో ఉపాధి పనులు నిర్వహిస్తున్న వేతనదారులు భయాందోళకు గురయ్యారు. పనులు నిర్వహించకుండా వెనుదిరిగారు. అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్లు అక్కడకు చేరుకుని సమీప తోటల్లోకి ఏనుగుల గుంపును తరలించారు. గుంపు సంచరిస్తున్న ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడరాదని సిబ్బంది హెచ్చరించారు. కాగా గ్రామంలోకి మొదటిసారిగా ఏనుగులు రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
బూర్జ సమీపంలో..
సీతానగరం: బూర్జ సమీపంలో శుక్రవారం రాత్రి ఏనుగులు సంచరించాయి. గురుగుబిల్లి మండలం నుంచి వెంకటాపురం పొలాల మీదుగా సీతానగరం మండలంలోకి అవి వచ్చాయి. అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని బూర్జ పొలాల్లోకి ఏనుగులను మళ్లించారు.