In the name of Zilla Parishad.. జిల్లా పరిషత్ పేరుకే..
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:21 AM
In the name of Zilla Parishad..ఐదేళ్ల వైసీపీ పాలనలో నిధులు లేక.. విధులు లేక జిల్లా పరిషత్ పాలకవర్గం ఉత్సవ విగ్రహంలా మారింది. రాష్ట్రంలోనే రాజకీయ వేదికంగా మారిన ఏకైక జిల్లా పరిషత్ విజయనగరం అని ముద్ర పడింది. వైసీపీ హయాంలోనే కాదు..
జిల్లా పరిషత్ పేరుకే..
వైసీపీ పాలనలో నిర్వీర్యం
ఆర్థిక సంఘం నిధులు వృథా
కనీస బాధ్యతలు నెరవేర్చలేని స్థితిలో యంత్రాంగం
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
విజయనగరం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
ఐదేళ్ల వైసీపీ పాలనలో నిధులు లేక.. విధులు లేక జిల్లా పరిషత్ పాలకవర్గం ఉత్సవ విగ్రహంలా మారింది. రాష్ట్రంలోనే రాజకీయ వేదికంగా మారిన ఏకైక జిల్లా పరిషత్ విజయనగరం అని ముద్ర పడింది. వైసీపీ హయాంలోనే కాదు.. ఇప్పుడు కూడా జడ్పీ వేదికగానే రాజకీయాలు నడుస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వైసీపీ హయాంలో ఏకంగా జడ్పీలోనే రాజకీయ ప్రెస్‌మీట్లు పెట్టిన సందర్భాలున్నాయి. ఈ విధంగా నిర్వీర్యం చేశారన్న విమర్శలున్నాయి. ఆ ఐదేళ్లు కనీస స్థాయిలో కూడా నిధులు ఖర్చుపెట్టలేదు. ఆర్థిక సంఘం నిధులన్నీంటినీ లాగేశారు. పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. ఫలితంగా పల్లెపాలన పూర్తిగా పడకేసింది.
ఉమ్మడి జిల్లాగానే జడ్పీ..
జిల్లాల విభజన జరిగినా.. జిల్లా పరిషత్ మాత్రం ఉమ్మడిగానే సాగుతోంది. విజయనగరం జిల్లాలో 777, మన్యం జిల్లాలో 451 పంచాయతీలున్నాయి. వీటిలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఆర్థిక సంఘం నిధులతోనే వేయాల్సి ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ దారి మళ్లించింది. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.27 కోట్లు విడుదలైతే పూర్తిగా పక్కదారి పట్టించేశారు. రెండో విడత నిధులు సైతం వివిధ పద్దుల కింద సర్దుబాటు చేసేశారు. ప్రజలకు అందించే తాగునీటికి పరీక్షలు, క్లోరినేషన్ వంటి చర్యలు పూర్తిగా లోపించాయి. రెండు జిల్లాల పరిధిలో 10 ప్రయోగ శాలలు ఉండేవి. వాటి పరిధిలో మండలాల్లో ఏడాదికోసారి కెమికల్, రెండుసార్లు బ్యాక్టీరియా పరీక్షలు నిర్వహించాలి. ఇవి కాకుండా అత్యవసర సమయాల్లో సైతం చేపట్టాలి. పంచాయతీలకు ఫీల్డ్ టెస్ట్ కిట్లు అందించాలి. ఇవన్నీ ఆర్థిక సంఘం నిధులతోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
తాగునీటికీ కష్టం..
ఉమ్మడి జిల్లాలో 33 సీపీడబ్ల్యూఎస్ పథకాలున్నాయి. వీటి ద్వారా సుమారు 10 లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తున్నారు. వీటి నిర్వహణకు ఆర్థిక సంఘం నిధులనే కేటాయించేవారు. ఏటా రూ.40 కోట్లు ఉంటే కానీ వీటి నిర్వహణ సాధ్యం కాదు. కానీ జిల్లా పరిషత్ ద్వారా కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిని బకాయిగా పెడుతుండడంతో సంబంధిత నిర్వాహకులకు పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణకుగాను రూ.168.కోట్ల వ్యయం కాగా..జడ్పీకి ఆర్థిక సంఘం నిధులు రూ.52.20 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.116.63 కోట్లు అందించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఇలా గత ఐదేళ్లలో జడ్పీ పాత్ర నామమాత్రమే.
- జడ్పీ పాలకవర్గానికి కేవలం పది నెలల పదవీకాలం మాత్రమే ఉంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లా పరిషత్ జిల్లా అభివృద్ధిలో ఎటువంటి ముద్ర చూపలేకపోయింది. పోనీమండల పరిషత్‌ల్లో ఆశించిన స్థాయిలో నిధులు లేవు. కొన్ని మండలాల్లో అయితే బ్యాంక్ అకౌంట్లలో నిల్ బ్యాలెన్స్ చూపిస్తోంది.
ఆదాయం లేకుండానే..
రిజిస్ర్టేషన్ సర్‌చార్జీలు, నీటి తీరువా పన్నుల్లో కొంత మొత్తం స్థానిక సంస్థలకు ఆదాయం వచ్చేది. ఎకరాకు నీటి తీరువా రూ.200 వసూలు చేస్తే అందులో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమ అయ్యేది. పంచాయతీ పరిధిలో ఎవరైనా భూములు విక్రయించి రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టయితే రిజిస్ర్టేషన్ శాఖ నుంచి సర్ చార్జీల రూపంలో కొంత మొత్తం పంచాయతీలకు వచ్చేది. కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అటు ఆదాయం లేక ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపై ఆధారపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేల నిధుల అంతంతమాత్రమే.