Share News

Tribal Life! ప్రకృతి ఒడిలో.. ఆదివాసీ జీవనం!

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:44 PM

In the Lap of Nature… Tribal Life! ఆదివాసీల జీవనశైలి ఎంతో ప్రత్యేకం. ఆశ్చర్యపరిచే ఆచార వ్యవహారాలు.. ఆకట్టుకునే సంస్కృతి.. సంప్రదాయాలు.. విభిన్న ఆహారపు అలవాట్లు.. కష్టించే మనస్తత్వం వారి సొంతం.. వ్యవసాయమే వారికి జీవనాధారం. కొండ కోనల్లో నివసించే గిరిబిడ్డలు... నిత్యం అడవితల్లి ఒడిలో బతుకువేట సాగిస్తుంటారు.

 Tribal Life!  ప్రకృతి ఒడిలో.. ఆదివాసీ జీవనం!
అటవీ ఉత్పత్తులను వారపు సంతకు తీసుకొస్తున్న గిరిజనులు

  • ఆశ్చర్చపరిచే ఆచార వ్యవహారాలు

  • ఆకట్టుకునే సంస్కృతి, సంప్రదాయాలు

  • విభిన్న ఆహారపు అలవాట్లు

  • నేటికీ వ్యవసాయంపైనే ఆధారం

  • అడవితల్లి ఒడిలో బతుకువేట

  • నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

సీతంపేట రూరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆదివాసీల జీవనశైలి ఎంతో ప్రత్యేకం. ఆశ్చర్యపరిచే ఆచార వ్యవహారాలు.. ఆకట్టుకునే సంస్కృతి.. సంప్రదాయాలు.. విభిన్న ఆహారపు అలవాట్లు.. కష్టించే మనస్తత్వం వారి సొంతం.. వ్యవసాయమే వారికి జీవనాధారం. కొండ కోనల్లో నివసించే గిరిబిడ్డలు... నిత్యం అడవితల్లి ఒడిలో బతుకువేట సాగిస్తుంటారు. కొండపోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే డబ్బుతో సంతల్లో వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. నేటికీ మూలికా వైద్యమే వారికి రక్ష. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలో గిరిపుత్రుల జీవన విధానం, వారి స్థితిగతులను ఇప్పుడు తెలుసుకుందాం..

వింత ఆచారాలు..

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టేవి వారి వింత ఆచారాలే. వాళ్ల పూర్వీకుల అనుగ్రహం కోసం వింత ఆచారాలతో వీరు చేసే పూజలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ప్రధానంగా ఆదివాసీలు ఆగం, పులి, విత్తన, కందికొత్తల, అమ్మోరమ్మ, జన్నిరాజు, కొండదేవత, టెంక, బాలే కొత్త పండుగ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి పితృదేవతలను ఆరాధిస్తారు.

ఏడాది పొడవునా పండుగలు..

సంస్కృతి, సంప్రదాయాలు ఉట్ట్టిపడేలా ఆదివాసీలు ఏడాది పొడవునా పండుగలు చేసుకుంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల్లో భాగంగా వారి ఇష్టదైవాలను ప్రార్థిస్తారు. ప్రత్యేక వేషధారణలతో సందడి చేస్తారు. ఆడ, మగ అంతా కలిసి థింసా, గుర్రపు నృత్యాలు చేస్తారు. గిరిజన యువత డప్పు , తుడుము వాయిద్యాలతో సందడి చేస్తారు. అందరూ కలిసి పూటుగా మద్యం తాగుతారు. గ్రామంలో ఎవరి ఇంట శుభకార్యమైనా వారికి తోచిన సహాయం చేస్తుంటారు. అంతేకాకుండా వీరు ఇప్పటికీ పాతకాలం నాటి వంట పాత్రలను వినియోగిస్తారు. వాటిలో వండడం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయనేది వారి నమ్మకం.

సాగు.. పంటలు ఇలా..

- ఆదివాసీలు ఇప్పటికీ పాత పద్ధతులననుసరించే వ్యవసాయం చేస్తుంటారు. నాగలి, పూదు, పార, గునపం,జిగ్గికత్తి,కోండి గొడ్డలి, కొడవలి, బాడిత, కొంటెకర్ర, కంక, బొరిగ వంటి వాటితో వ్యవసాయ పనులు చేస్తుంటారు. తక్కువ పెట్టుబడితో ఎంతోకొంత లాభాన్ని ఆర్జిస్తారు. అయితే వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు మాత్రం ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రావడం లేదు.

- గిరిజనులు పండించే పంటల్లో ప్రధానంగా గంటెలు, సామలు, నువ్వులు, ఒలుసులు, జునుములు, రాగులు, ఉలవలు, కొర్రలు, బొబ్బర్లు అధికంగా ఉంటాయి. కొండపోడు, మెట్టు భూముల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. గిరిజనులు పండించే మిల్లేట్స్‌కు మైదాన ప్రాంతంలో మంచి గిరాకీ ఉంది. దీంతో ఈ పంటల ద్వారా తమ ఆర్థికస్థితిని మెరుగుపరు చుకుంటున్నారు.

- ఆదివాసీలు ఎంతో ప్రియంగా ఆకుకూరలను పండిస్తుంటారు. ఎటువంటి రసాయన ఎరువులు వినియోగించరు. సేంద్రియ పద్ధతుల్లో పండిందచే ఆకు కూరలను వీరెంతో ఇష్టంగా తింటారు. గోంగూర, బోదంటెం కూర, గుడంకూర, అడవిదొండ, అంగాకరకాయలు, చేదుకూర, మునగకూరలతో పాటు దుంపజాతికి చెందిన కండ, గోని, అరిక, చేదు దుంపలు, కర్ర పెండ్లం, చార దుంపలను ఎక్కువగా పండిస్తుంటారు. అడవిలో దొరికే వెదురును వండుకొని తింటారు. అంతేకాకుండా పుల్లేరు చీమలతో రకరకాల వంటలను వండుతారు.

మూలికా వైద్యమే రక్ష

గిరిశిఖర గ్రామాల్లో నివసించే ఆదివాసీలు నేటికీ మూలికా వైద్యాన్నే నమ్ముతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతరాత్ర ఏ వ్యాధులైనా గ్రామాల్లో మూలికావైద్యులను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా పచ్చకామెర్లు, అతిసారం, చర్మవ్యాధులు, విషజ్వరం, విరిగిన అవయవాలకు కట్టు కట్టడం, మూలశంక, మొలలు, మూర్చ, మలబద్దకం, దగ్గు వంటి వ్యాధులకు వివిధ రకాల మూలికల ద్వారా రోగులకు వైద్యం అందిస్తారు. కొండ ప్రాంతంలో లభించే అరటి, జమ్మరాజు మొక్క, పాతాళగిరడ, నేరేడుతో పాటు పాముకాటుకు నాగసారం వంటి మూలికలను ఉప యోగించి వైద్యం అందిస్తారు. అయితే ఈ మూలికా వైద్యాన్ని బయటవారు నమ్మకపోయినప్పటికీ ఆదివాసీలు మాత్రం అమితంగా విశ్వసిస్తుంటారు.

కష్టించే మనస్తత్వం

గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో మెజార్టీ గిరిజనులు గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, సాలూరు, మక్కువ, పాచిపెంట, సీతంపేట మండలాల్లో ఉన్నారు. సవర తెగ గిరిజనులు పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జాతాపు కొండదొరలు పోడుతో పాటుగా మెట్ట వ్యవసాయం చేస్తున్నారు. జాతాపు, సవర, కొండదొర తెగలకు చెందిన వారే మన్యంలో అధికంగా ఉన్నారు. జంతు బలులు ఇచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. ప్రతి గిరిజన గ్రామంలో ఎనోడు, దిసరి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. పండుగల నిర్వహణకు వారే ముహూర్తాలు తీస్తుంటారు. ఎవరినా ప్రేమించకుంటే పెళ్లి కూతురు కుటుంబానికి పెళ్లి కొడుకు కొంత కట్నం, కానుకలు ఇవ్వాలి. ఈ పెళ్లికి పెద్దలు ఇష్టపడక పోతే కొంత మొత్తం బియ్యం, నిత్యావసర సరుకులు, సారా తదితర వస్తువులతో తప్పు చెల్లించాలి. అప్పుడే కుల పెద్దలు అంగీకరించి వీరికి పెళ్లి చేస్తారు. సీతంపేట మన్యంలో అత్యధికంగా సవర, జాతాపు, గదబ కులాలకు చెందిన గిరిజనులు ఎక్కువగా జీవిస్తున్నారు. వీరి జీవనశైలి మిగిలిన ప్రాంతాల ఆదివాసీల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ఏడాది పొడవునా నిర్వహిం చుకునే పండుగలు, పంటలు ఇతరాత్ర అంశాలపై ఓ కాలచక్రాన్ని తయారుచేసుకున్నారు. ఈ కాలచక్రంలో వీరు ఎప్పుడు ఏది చేయాల నేది వివరించి ఉంటుంది. దానికి అనుగుణంగా వీరు వ్యవహరిస్తుం టారు. ఆదివాసీల్లో కులాలు ఎన్ని ఉన్నా.. ఆయా ప్రాంతాలను బట్టీ వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలు, ఆహారపు అలవాట్లు మారుతుంటాయి.

Updated Date - Aug 08 , 2025 | 11:44 PM