Share News

Lands పేదల భూముల్లో .. పెద్దల పాగా!

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:38 AM

In the Lands of the Poor… the Grip of the Powerful! జియ్యమ్మవలస మండల పరిధి చింతలబెలగాం పంచాయతీలో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది. వారి డీ పట్టా భూములు లీజుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గతంలో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు సైతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లుగా మారిపోయాయి.

 Lands  పేదల భూముల్లో .. పెద్దల పాగా!
అప్పట్లో దళితులకు కేటాయించిన డీ పట్టా భూములు

  • లీజు గడువు పూర్తయినా తిరిగివ్వని వైనం

  • బాధితుల ఇళ్ల స్థలాల్లో జగనన్న లేఅవుట్లు

  • కబ్జాకు గురైన చెరువు, శ్మశాన వాటిక

  • పట్టించుకోని అధికారులు

  • న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

జియ్యమ్మవలస, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండల పరిధి చింతలబెలగాం పంచాయతీలో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది. వారి డీ పట్టా భూములు లీజుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గతంలో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు సైతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లుగా మారిపోయాయి. చివరికిఆ గ్రామంలో శ్మశానవాటిక, చెరువు కూడా ఆక్రమణలకు గురైంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసి.. ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా.. ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- తుమ్మలవలస రెవెన్యూ పరిధి 12 సర్వే నెంబర్లలో 6.66 ఎకరాలను 1974-75లో చింతల బెలగాం గ్రామ దళితుల్లో 12 మందికి ఇచ్చారు. 1982-84లో చింతలబెలగాం రెవెన్యూ పరిధి 9 సర్వే నెంబర్లలో ఉన్న 5.40 ఎకరాలను అదే గ్రామానికి చెందిన ఐదుగురు దళితులకు ఇచ్చారు. మొత్తంగా 12.06 ఎకరాల భూమిని 14 మంది చింతలబెలగాం దళితులకు ఇచ్చారు. ఈ భూమిని వీరు సాగు చేసుకుంటూ జీవించేవారు.

- 1993లో ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి భూములను 30 ఏళ్ల పాటు ఆ రెండు గ్రామాల్లో 14 మంది అగ్రకులాల వారికి లీజుకి ఇచ్చారు. కాగా 1994 వరకు వారే భూశిస్తులు చెల్లించారు. అయితే లీజు కాలం పూర్తయిన తర్వాత తమ భూమి ఇవ్వాలని లీజుదారులకు దళితులు అడగ్గా.. వారు ససేమిరా అన్నారు. ‘మీ వద్ద అసలు లీజుకు మేం భూములు తీసుకోలేదు. అవి మా జిరాయితీ భూములు’ అని వారు దళితులపై ఎదురు తిరిగారు. దీంతో 2024, డిసెంబరు 17న చింతలబెలగాం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో దళితులు ఆధారాలతో సహా దరఖాస్తు చేశారు. రెవెన్యూశాఖ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. 2025, ఆగస్టు 23న ఇరు పక్షాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక్కడి దళితులు అధికారుల అన్ని విషయాలు తెలిపారు. అయితే దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ , సబ్‌ కలెక్టర్‌ ఆదేశించినా మండల రెవెన్యూశాఖ స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- 1997లోనే లీజుదారులకు వత్తాసు పలుకుతూ రికార్డులను తారుమారు చేసి డీపట్టా భూములను జిరాయితీ భూములుగా రెవెన్యూశాఖ మార్చిందని దళితులు చెబుతున్నారు. ఫెయిర్‌ అడంగల్‌, 10(1) అడంగల్‌, మాన్యువల్‌ 1బీ వంటి అన్ని హక్కు పత్రాలు తమకే ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ (పీవోటీ) యాక్ట్‌ నిబంధనలు పాటించలేదని వాపోతున్నారు.

- 2025, అక్టోబరు 4న జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ కమిటీ (డీవీఎంసీ)లో కూడా దళితులు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాదిలో రెండు, మూడుసార్లు తహసీల్దార్‌ కార్యాలయం ముందు వారు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

వారి ఇళ్ల స్థలాల్లో జగనన్న లేఅవుట్‌

- 1976లో చింతలబెలగాం దళితులకు 1.15 ఎకరాలను ఇళ్ల స్థలాల కింద కేటాయించారు. 35 కుటుంబాలకు 3 సెంట్లు చొప్పున ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్‌ యోజన (ఐఏవై) పథకం కింద అప్పటి అధికారులు ఇళ్లు నిర్మించారు. వాటిల్లో పాతికేళ్ల పాటు దళితులు నివాసం ఉన్నారు. అయితే ఆయా ఇళ్లు శిఽథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న భూమిలో ఇళ్లు నిర్మించుకొని వారు జీవిస్తున్నారు. కాగా దళితులకు ఇచ్చిన 1.15 ఎకరాల్లో గతంలో అధికారులు జగనన్న లేఅవుట్లు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై వైసీపీ నాయకులు బెదిరించి.. కేసులు కూడా పెట్టారని బాధితులు చెబుతున్నారు. 2020-24 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, ఆ తరువాత కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని దళితులు వాపోతున్నారు.

శ్మశానవాటిక, చెరువు ఆక్రమణ

- ఆ గ్రామంలో చెరువులు, శ్మశాన వాటికలకు దిక్కులేకుండా పోయింది. సర్వే నెంబరు 46లో ఐదెకరాల స్థలం ఉండేది. ఇందులో సర్వే నెంబరు 46/1లో 2.90 ఎకరాల్లో చెరువు ఉండేది. కానీ కబ్జాలతో ఇప్పుడు కేవలం 60 సెంట్లకే చెరువు పరిమితమైంది.

- మిగిలిన ప్రభుత్వ స్థలంలో దళితుల శ్మశాన వాటిక ఉండేది. కానీ మొత్తం ఆక్రమణకు గురవడంతో ఇప్పుడు కేవలం సెంటున్నర స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందని ఆ గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం చేయాలి

చింతలబెలగాం పంచాయతీ పరిధిలో చెరువులు, ఇంటి స్థలాల ఆక్రమణ, డీ పట్టా భూముల రికార్డుల ట్యాంపరింగ్‌ వ్యవహారాలపై కలెక్టరే స్వయంగా విచారణ చేసి దళితులకు న్యాయం చేయాలి. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

-టి.ప్రవీణ్‌కుమార్‌, చింతలబెలగాం, సామాజిక కార్యకర్త

================================

విచారణ చేస్తాం

చింతలబెలగాం, తుమ్మలవలస రెవెన్యూ గ్రామాల పరిధిలో జరిగిన వ్యవహారం ఇటీవల నా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం.

- ఎన్‌.అప్పారావు, తహసీల్దార్‌, జియ్యమ్మవలస

Updated Date - Nov 20 , 2025 | 12:38 AM