Share News

12 మండలాల్లోనూ శిథిలావస్థలోనే..

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:55 PM

జిల్లాలో పలుచోట్ల మండల వనరుల కేంద్రాలు (ఎమ్మార్సీ) అధ్వానంగా తయారయ్యాయి. భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి.

 12 మండలాల్లోనూ  శిథిలావస్థలోనే..
శిథిలావస్థలో ఉన్న గరుగుబిల్లి మండల వనరుల కేంద్రం

- ఇదీ మండల వనరుల కేంద్రాల పరిస్థితి

- వర్షం కురిస్తే.. ఇక అంతే...

- కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు

- బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు

- వాటి నిర్మాణానికి హామీ ఇచ్చి మరిచిపోయిన వైసీపీ

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

గరుగుబిల్లి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల మండల వనరుల కేంద్రాలు (ఎమ్మార్సీ) అధ్వానంగా తయారయ్యాయి. భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షం కురిస్తే కార్యాలయాలన్నీ కారిపోతున్నాయి. గదుల్లోకి నీరు చేరడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. జిల్లాలో పాలకొండ, పార్వతీపురం, సీతానగరం మండలాలు మినహా మిగిలిన 12 మండలాల్లో ఎమ్మార్సీ భవనాలు శిఽథిలావస్థలో ఉన్నాయి. నాడు-నేడు కింద వాటి నిర్మాణాలు చేపడతామని గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. దీంతో ఆయా భవనాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గరుగుబిల్లి ఎమ్మార్సీకి చెందిన పుస్తక సామగ్రితో పాటు పలు రకాల పరికరాలను జడ్పీ హైస్కూల్‌లో భద్రపరుస్తున్నారు. గతంలో వర్షం కారణంగా సామగ్రి మొత్తం పనికిరాని విధంగా తయారైంది. అప్పట్లో భవన మరమ్మతులకు కొంతమేర ఆర్థిక సాయం అందినప్పటికీ పరిస్థితి మారలేదు. ఎమ్మార్సీకి ఆనుకుని ఉన్న మరుగుదొడ్లు కూడా అధ్వానంగా మారాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్సీల నిర్వహణకు ఏటా నిధులు కేటాయించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాటికి మంగళం పాడింది. గత ఐదేళ్లుగా ఎమ్మార్సీ భవనాలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలోనైనా ఆయా భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఎమ్మార్సీ భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని గరుగుబిల్లి ఎంఈవో దత్తి అప్పలనాయుడు తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 11:55 PM