‘Open House’ ఆకట్టుకున్న ‘ఓపెన్ హౌస్’
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:58 PM
Impressive ‘Open House’ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డాగ్ షో విన్యాసాలు, పోలీస్ బ్యాండ్ బృందం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి.
బెలగాం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డాగ్ షో విన్యాసాలు, పోలీస్ బ్యాండ్ బృందం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు.. పోలీస్ విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, తుపాకులు, సమాచార వ్యవస్థ, రక్షణ కోసం ఉపయోగించే పరికరాలపై ఎస్పీ మాధవరెడ్డి వివరించారు. ప్రతిఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటివల్ల జీవితం నాశనం అవుతుందని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయినా, అక్రమ రవాణాకు పాల్పడినా, విక్రయించినా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో లేదా 1972 నంబర్‌కు ఫోన్‌చేయాలన్నారు. సైబర్ నేరాల బారిన పడితే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అంతకుముందు ‘పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర’ అనే అంశంపై జిల్లా పోలీస్ సిబ్బందికి వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో సీసీటీవి సర్వైలెన్స్, సైబర్ క్రైమ్ దర్యాప్తులు, డ్రోన్ పోలీసింగ్, సీసీటీఎన్‌ఎస్, డిజిటల్ అధారిత నేర నియంత్రణ పద్ధతులపై పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు మురళీధర్, రంగనాథం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.