Roads Damaged మొంథా ప్రభావం... రోడ్లు ఛిద్రం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:17 AM
Impact of Monsoon... Roads Damaged మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. కోతకు గురై.. గోతులమయమయ్యాయి. అనేక చోట్ల కల్వర్టులు కూడా కుంగిపోయాయి. వంతెనలు మరింత ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో అధ్వానంగా మారిన రహదారులు
వాహనదారులు, ప్రయాణికులకు తప్పని అవస్థలు
గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి సరేసరి..
రాళ్లు తేలిన మార్గంలో రాకపోకలు సాగించలేని దుస్థితి..
సకాలంలో విద్య, వైద్యసేవలు పొందలేకపోతున్న గిరిపుత్రులు
ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
పార్వతీపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. కోతకు గురై.. గోతులమయమయ్యాయి. అనేక చోట్ల కల్వర్టులు కూడా కుంగిపోయాయి. వంతెనలు మరింత ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గిరిజన రహదారుల పరిస్థితి సరేసరి. రాళ్లు తేలి దారుణంగా తయారయ్యాయి. దీంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. చాలాచోట్ల రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సదుపాయం లేక 108 వాహనాలు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదు. దీంతో గిరిపుత్రులు అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందలేకపోతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు చేరుకోలేకపోతున్నారు. అటవీ ఉత్పత్తులు, పంటలను సైతం కాలినడకన కొండ దిగి విక్రయించుకోలేకపోతున్నారు. కొన్ని గ్రామాల్లో గిరిజనులు శ్రమదానం చేసి రహదారులపై గుంతలను పూడ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మొంథా తుఫాన్ ధాటికి ఛిద్రమైన రహదారులను బాగు చేయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ జిల్లా ఇంజనీరింగ్ అధికారి రాధాకృష్ణను వివరణ కోరగా.. ‘మొంథా తుపాను ప్రభావంతో మన్యంలో రహదారులకు ఏర్పడిన నష్టంపై కలెక్టర్‌కు నివేదించాం. కొన్ని రహదారుల మరమ్మతులకు సుమారు రూ.16 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించాం.’ అని తెలిపారు.