Share News

Illegal Stockpiles ఎక్కడికక్కడే అక్రమ నిల్వలు!

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:04 AM

Illegal Stockpiles Everywhere! ఖరీఫ్‌ రైతులు ఎరువులు, విత్తనాల విషయంలో ఏ ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు వాటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో ఎరువులు, విత్తనాలు జిల్లాకు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో కొంతమంది వ్యాపా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

 Illegal Stockpiles ఎక్కడికక్కడే అక్రమ నిల్వలు!
మక్కువ మండలం సన్యాసిరాజపురంలో అధికారులు సీజ్‌ అక్రమ ఎరువు నిల్వలు

  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది వ్యాపారులు

  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైనం

  • దాడుల్లో పట్టుబడుతున్నా.. మారని పరిస్థితి

పార్వతీపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ రైతులు ఎరువులు, విత్తనాల విషయంలో ఏ ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు వాటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో ఎరువులు, విత్తనాలు జిల్లాకు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో కొంతమంది వ్యాపా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇదే అదునుగా భావించి గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. అధిక ధరలకు వాటిని రైతులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై సంబంధిత వ్యవసాయాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. విజిలెన్స్‌, జిల్లా అధికా రులు దాడులు నిర్వహించినప్పుడే అక్రమాలు బయట పడుతున్నాయి. కేసు నమోదుతోనే సరిపెడుతుండడంతో జిల్లాలో కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏటా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు 45,277 మెట్రిక్‌ టన్నులు ఎరువులు అవసరం. అయితే ఇప్పటివరకు 19,937 మెట్రిక్‌ టన్నులు సరఫరా అయ్యాయి. యూరియా 21,483 మెట్రిక్‌ టన్నులకు గాను 8,800 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8,488 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 4,708 మెట్రిక్‌ టన్నుల వరకూ జిల్లాకు వచ్చింది. కాంప్లెక్స్‌ ఎరువులు 9,200 మెట్రిక్‌ టన్నులు అవసరం . అయితే ఇప్పటివరకు 2,697 మెట్రిక్‌ టన్నులే వచ్చింది. 3048 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌కు గాను 1434 మెట్రిక్‌ టన్నులు, సూపర్‌ పాస్పెట్‌ 3,058 మెట్రిక్‌ టన్నులకు గాను ఇంతవరకు 2,298 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు సరఫరా అయ్యాయి.

- ఈ నెలాఖరుకు 21,542 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. ఇప్పటివరకు 19,937 మెట్రిక్‌ టన్నులు ఎరువులు వచ్చాయి. అందులో 12,752 మెట్రిక్‌ టన్నుల పంపిణీ పూర్తయ్యింది. ఇంకా 7,185 మెట్రిక్‌ టన్నులు ఎరువులు నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

నమోదైన కేసులు ఇలా..

- 2020-21లో గరుగుబిల్లి మండలం గిజబా గ్రామంలో సుమారు రూ.1.40 లక్షలు విలువ చేసే 7.64 మె ట్రిక్‌ టన్నుల ఎరువులను అధికారులు సీజ్‌ చేశారు.

- 2022-23లో బలిజిపేట మండలం వంతరాంలో 14.4 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు. వాటి విలువ సుమారు రూ.పది లక్షల వరకూ ఉండగా.. బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేశారు.

- 2023-24లో బలిజిపేటలోని ఓ ఎరువుల దుకాణంపై అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రెండు లక్షల విలువ చేసే 19.325 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు.

- అదే ఏడాది గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలోని ఓ ఎరువుల దుకాణంలో సుమారు రూ.3 లక్షల విలువైన 45 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అధికారులు సీజ్‌ చేశారు. 2024-25 లోనూ అదే దుకాణంలో 64.3 మెట్రిక్‌ టన్నులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.8 లక్షల వరకూ ఉంటుంది. 2020-21లో కూడా ఆ దుకాణంలో రూ. 6 లక్షల విలువైన 47.62 మెట్రిక్‌ టన్నుల ఎరువులను అధికారులు సీజ్‌ చేశారు. మూడుసార్లు అదే దుకా ణంలో అధికారులు దాడులు చేశారంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- 2024-25లో భామినిలో ఎరువులు దుకాణంపై అధికారులు దాడులు నిర్వహించి రూ.7.80 లక్షల విలువ చేసే 46.595 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు.

- గత నెల 28న మక్కువ మండలం శంబర గ్రామంలోని ఓ ఎరువుల షాపుపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. స్టాక్‌ రిజిస్టర్‌కు, నిల్వలకు మధ్య ఉన్న తేడాలను గుర్తించారు. రూ.28 లక్షల విలువ చేసే 119.9.25 టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు.

- ఇటీవల మక్కువ మండలం సన్యాసిరాజపురం సచివాలయ భవనంలో 285 బస్తాల ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యవ సాయాధికారి రాబర్ట్‌పాల్‌ ఆధ్వర్యంలో వారు దాడులు చేసి ఆ ఎరువులను సీజ్‌ చేశారు.

అంతంతమాత్రంగానే చర్యలు

జిల్లాలో ఏటా ఎరువుల దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించి.. కొంతమంది వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నా.. తూతూ మంత్రంగానే చర్యలు ఉండడం వల్ల పరిస్థితి మారడం లేదు. కొన్ని దుకాణాల్లో యథావిఽధిగానే అక్రమాలు సాగుతున్నాయి. రైతుల అవసరా లను ఆసరాగా తీసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఎరువులను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా రెట్టింపు లాభాలను ఆర్జిస్తు న్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తప్పవు

అధిక ధరలకు ఎరువులను విక్రయించినా.. ఎక్కడైనా బ్లాక్‌ చేసినా కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులను పక్కదారి పట్టించి పక్క రాష్ర్టాలకు తరలించిన వారి సమాచారం తెలియజేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

-రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - Jul 12 , 2025 | 12:04 AM