Illegal pesticides stock వైసీపీ నేత గోదాంలో అక్రమంగా పురుగుమందులు
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:06 AM
Illegal pesticides stock అలమండ గ్రామంలో వైసీపీ నేత, ఉపసర్పంచ్ లగుడు దేవుడుకు చెందిన మామిడి గోదాంలో భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుమందులు, పౌడర్లను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సింహాచలం, ఏవో పూర్ణిమ గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీకి వెళ్లిన వారు అక్కడ 3550 లీటర్ల పురుగుమందుల ద్రావణం, 2085 కేజీల పౌడర్‌ను గుర్తించారు.
వైసీపీ నేత గోదాంలో అక్రమంగా పురుగుమందులు
వాటి విలువ రూ.55లక్షలు
పక్కా సమచారంతో తనిఖీకి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
రాత్రి వరకు సోదాలు, రికార్డుల పరిశీలన
స్వలాభం లేదంటూ నేత, అనుచరుల వ్యాఖ్యలు
జామి, నవంబరు4 (ఆఽంధ్రజ్యోతి): అలమండ గ్రామంలో వైసీపీ నేత, ఉపసర్పంచ్ లగుడు దేవుడుకు చెందిన మామిడి గోదాంలో భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుమందులు, పౌడర్లను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సింహాచలం, ఏవో పూర్ణిమ గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీకి వెళ్లిన వారు అక్కడ 3550 లీటర్ల పురుగుమందుల ద్రావణం, 2085 కేజీల పౌడర్‌ను గుర్తించారు. వీటివిలువ ఎంఆర్‌పీ ప్రకారం రూ.55లక్షలుగా పేర్కొన్నారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ వ్యాపారం పెద్దఎత్తున సాగుతోందని ఎస్‌పీకి ఫిర్యాదు అందింది. ఆ మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది కలిసి మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు అలమండ గ్రామానికి చేరుకున్నారు. అనంతరం వైసీపీనేతకు చెందిన గోదాంకు వెళ్లారు. లోపల పురుగుమందుల డబ్బాలు, పౌడర్ ప్యాకెట్లు గుర్తించారు. నిల్వల పరిశీలనతో పాటు రికార్డులను రాత్రి ఏడువరకు పరిశీలించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ గతనెల అక్టోబర్‌లో వీటిని ఢిల్లీనుంచి పెద్దఎత్తున తెచ్చి నిల్వచేసినట్లు గుర్తించామన్నారు. ఇది 1968 చట్టప్రకారం నేరమని, కేసు నమోదు చేసి గోదాం సీజ్ చేస్తామన్నారు.
గోదాం వద్దకు చేరుకున్న అనుచరులు
అధికారులు తనిఖీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్న విషయం తెలుసుకున్న వైసీపీ నేత అనుచరులు అక్కడకు చేరుకున్నారు. ఇవి అమ్మడానికి కాదని, ‘మా దేవుడు సార్ మా ఆందరి కోసం తెప్పించి, మా మామిడిపంటలకు పిచికారీ చేసుకోవడానికి ఇస్తారని, వీటిని అరువు తీసుకొని తమ పంట అమ్ముకున్నాక డబ్బులు ఇస్తామని’ చెప్పారు. ఇదే విషయంపై ఆ వైసీపీ నేత మాట్లాడుతూ తాను 2023 నుంచి ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి వీటిని తెప్పించి రైతులకు అరువు ఇస్తున్నానని, వీటికి లైసెన్స్ ఉండాలని తెలియదని చెప్పడం గమనార్హం.
‘మీడియాకు అలా చెప్పొద్దు’
అధికారులు పూర్తిగా వివరాలు రాసుకున్నాక ఆ వైసీపీ నేత అధికారులతో వాదనకు దిగారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.55లక్షలు చెబుతున్నారని, విలేకర్లకు అలా చెప్పడానికి వీలులేదని పట్టుపట్టారు. ఆయన వర్గీయులు కూడా అలాగే చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కాగా పురుగుమందులు నిల్వచేసే గోదాంకు పంచాయతీ అనుమతులు కూడా లేవని స్థానికులు తెలిపారు. ఇదేవిషయంపై పంచాయతీ కార్యదర్శి ఎర్నమ్మను వివరణ కోరగా ఈ భవనానికి ఎటువంటిపన్నులు కట్టడం లేదని స్పష్టంచేశారు.