Share News

చేయి తడిపితే.. అన్నీ సక్రమమే!

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:12 AM

జిల్లాలోని ఓ మండలంలో లేఅవుట్‌ను వేసేందుకు ఓ రియల్‌ వ్యాపారి రైతుల నుంచి భూములు సేకరించాడు.

చేయి తడిపితే.. అన్నీ సక్రమమే!
శృంగవరపుకోటలోని పంట భూమి

- అవినీతికి ఆసరాగా భూ లొసుగులు

- రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కాసుల వేట

- అడిగినంత ఇచ్చేస్తున్న రియల్‌ వ్యాపారులు

- సామాన్య రైతులకు తప్పని ఇబ్బందులు

శృంగవరపుకోట ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ఓ మండలంలో లేఅవుట్‌ను వేసేందుకు ఓ రియల్‌ వ్యాపారి రైతుల నుంచి భూములు సేకరించాడు. ఈ భూముల్లో కొన్ని వెబ్‌ ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఓ సర్వే నెంబర్‌లోని కొంత భూమి ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటే, మిగతా భూమి ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న భూమికి డాక్యుమెంట్‌ ఉంది. ఆన్‌లైన్‌లో లేని భూమికి ఎటువంటి పత్రాలు లేవు. భూ రికార్డులో వేరొకరి పేరు కనిపిస్తుంది. ఈ భూమంతా ఒకే రైతు స్వాధీనంలో ఉంది. ఇలా లొసుగులతో ఉన్న భూములను వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు అవకాశం ఉండదు. దీంతో ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారులను సంప్రదించాడు. వారడిగినంత ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అంతే అంతవరకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములన్నీ రెండు నెలల వ్యవధిలోపే అందులోకి వచ్చేశాయి. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చకచక రిజిస్ట్రేషన్‌ కూడా జరిగిపోయింది.

మరో మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గించుకునేందుకు అర ఎకరా భూమికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకుని, మిగతాది చేసుకోలేదు. మొత్తం ఎకరా భూమిలో రెండు దశబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల డబ్బులు అవసరం పడడంతో భూమిని విక్రయించాలనుకున్నాడు. అయితే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్‌ జరిగిన అర ఎకరా భూమిని మాత్రమే ఆన్‌లైన్‌ చేశారు. మిగిలిన 50 సెంట్లు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో భూమిని అమ్మేందుకు ఆ రైతుకు వీలుకాలేదు. మొత్తం భూమి వెబ్‌ల్యాండ్‌లో నమోదుకావాలంటే తమకు కొంత ముట్టజెప్పాలని రెవెన్యూ అధికారులు అనడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రైతు వారి అడిగనంత ఇచ్చి పని చేయించుకున్నాడు.

వేరొక మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన భూమిని అమ్మాలనుకున్నాడు. ఓ కొనుగోలుదారుడు ముందుకు రావడంతో మధ్యవర్తుల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ భూ రికార్డుల్లో చిన్న చిన్న లొసుగులు కనిపిస్తుండడంతో నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని సబ్‌ రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారుల ద్వారా భూ రికార్డు సరిచేసుకుని రావాలని సూచించారు. ఇదంతా జరిగేందుకు నెల, రెండు నెలల సమయం పట్టడంతో పాటు ఎంతోకొంత ఖర్చవుతుందని భావించిన ఇరువర్గాలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఓ మధ్యవర్తిని సంప్రదించాయి. సబ్‌రిజిస్ట్రార్‌ సెలవు పెట్టేటప్పుడు ఇందులో పని చేస్తున్న వేరొక ఉద్యోగికి, ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారని, అడిగినంత ఇస్తే ఆయనతో రిజిస్ట్రేసన్‌ చేయిస్తానని మాట ఇచ్చాడు. చెప్పినట్లే వారం రోజుల లోపే పని పూర్తిచేయించాడు.

భూ రికార్డుల్లో ఉన్న లొసుగులను కొందరు రెవెన్యూ అధికారులు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడుతున్నారు. వారికి డబ్బులిస్తే అక్రమ రికార్డులు కూడా సక్రమం అయిపోతాయనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వారినే పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తమ మండలాల్లో నియమించుకుని, వారితో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 నుంచి వెబ్‌ ల్యాండ్‌ అందుబాటులోకి వచ్చింది. భూ రికార్డులన్నీటిని అధికారులు ఆన్‌లైన్‌ చేశారు. రికార్డుల్లో ఉన్న పేర్లకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాలను నమోదు చేశారు. జిరాయితీ భూములను 22(ఏ)లో నమోదు చేసేశారు. వీటిని తొలగించుకునేందుకు రైతులు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే క్రయ, విక్రయాలతో భూములు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిలో చాలా మంది భూ రికార్డుల్లో పేర్లను మార్చుకోలేదు. దీంతో డాక్యుమెంట్‌ల్లో ఓ సర్వే నెంబర్‌ ఉంటే, క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్న భూమికి మరో సర్వే నెంబర్‌ ఉంటుంది. కొన్ని భూములకు రికార్డుల్లో సరైన వివరాలు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు గ్రామం పేరున ఖాతాను సృష్టించి వదిలేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఇందుకు సంబంధించిన సర్వే నెంబర్లను తెరిచి చూస్తే రైతు పేరు వద్ద గ్రామం పేరు కనిపిస్తుంది. చాలా మంది రైతులు మూడు, నాలుగు దశాబ్దాల కిందట గ్రామ పెద్దల వద్ద డబ్బులు ఇచ్చి భూములు కొనుగోలు చేసుకున్నట్లు తెల్లకాగితంపై రాయించుకున్నారు. వీటినే గ్రామ పురోణి, సాదాబైనామాలని పిలుస్తున్నారు. మరి కొంతమంది రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గుతాయని ఎకరా భూమికి అర ఎకరాగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, మిగిలిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ సాగు చేసుకుంటున్న రైతుల వద్ద ఉంటున్నప్పటికీ, రికార్డుల్లో మాత్రం వేరేవారి పేర్లు ఉంటున్నాయి. రికార్డుల్లో పేర్లు ఉన్నవారు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని తమ పేరున ఆ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుంటున్నారు. అనంతరం వాటిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఆర్థిక, రాజకీయ బలం ఉన్న వ్యక్తులకు అమ్మేస్తున్నారు. రికార్డుల ప్రాప్తికి రెవెన్యూ, పోలీస్‌ అధికారుల సహకారంతో బలవంతంగా అసలైన యజమానుల నుంచి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం వెబ్‌ ల్యాండ్‌ ఆధారంగా భూ క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. వెబ్‌ ల్యాండ్‌లో పేర్లు కనిపిస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ, ఇతర ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా ఊపందుకోవడంతో భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ పరిస్థితుల్లో భూములను కాపాడుకోనేందుకు రైతులు జాగ్రత్తలు పడుతున్నారు. తమ భూములను ఆన్‌లైన్‌ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తుంది. రికార్డుల్లో ఉన్న లోసుగులను చూపించి బేరం పెడుతున్నారు. అడిగినంత ఇచ్చేవారికి కిమ్మనకుండా ఆన్‌లైన్‌ చేసేస్తున్నారు. మిగతా వారిని పట్టించుకోవడం లేదు. డాక్యుమెంట్‌లో ఓ సర్వే నెంబర్‌ ఉందని, సాగులో ఉన్న భూమి మరో సర్వే నెంబర్‌ ఉందని, రికార్డుల్లో పేరు ఉన్న రైతు, వారి వారసులతో ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదని సంతకాలు పెట్టి తీసుకురావాలని మెలకపెడుతున్నారు. అదే విధంగా కొంత భూమికి రిజిస్ట్రేషన్‌ ఉండి, మరికొంత భూమికి లేకపోవడంతో మొత్తం కూడా రిజిస్ట్రేషన్‌ చేయించుని రావాలని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతాలను బట్టి సెంటు భూమి రూ.30వేల నుంచి రూ.5లక్షల వరకు పలుకుతుంది. రిజిస్ట్రేషన్‌ కోసం అప్పట్లో భూమిని అమ్మిన రైతు, వారి వారసులను సంప్రదిస్తే తమకు ఎంతోకొంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొంతమందైతే భూమి తమ పేరున రికార్డుల్లో ఉందని తెలిసిన వెంటనే ఆన్‌లైన్‌ నమోదుకు దరఖాస్తులు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది భూ యజమానుల రెవెన్యూ అధికారులకు వారి అడిగినంత ఇచ్చి తమ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుంటున్నా రు. మరికొంతమంది అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కాసులు కురిపించే కల్పతరువులుగా భూ సమస్యలు మారాయి.

Updated Date - Aug 30 , 2025 | 12:12 AM