Share News

షాపు పెట్టాలంటే ఇచ్చుకోవాల్సిందే!

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:14 AM

ఇటువంటి పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల ఉంది. ప్రతి మండలంలో మూడు నుంచి ఐదు తాత్కాలిక బాణసంచా షాపుల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారు.

షాపు పెట్టాలంటే ఇచ్చుకోవాల్సిందే!
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తాతాల్కిక షాపులు

- తాత్కాలిక బాణసంచా దుకాణాల అనుమతులకు అదనపు వసూళ్లు

- వ్యాపారులపై భారం

- బయట పడేందుకు వినియోగదారులపై బాధుడు

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

-గంట్యాడ మండలం బాణసంచా దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి ఓ వ్యక్తి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనలు మేరకు అగ్నిమాపకశాఖకు రూ 500, పోలీసు శాఖకు రూ.500, రెవెన్యూ శాఖకు రూ.50 చొప్పున చలానా చెల్లించాడు. ఆ వ్యక్తి ప్రభుత్వానికి అధికారికంగా చెల్లించింది రూ1050. అయితే, అనుమతిపత్రాలు పొందడానికి మరో రూ.20 వేలు ఖర్చు అయినట్లు ఆయన వాపోతున్నాడు. అంతేకాకుండా దీపావళి సామగ్రిలో కొన్ని ఫ్యామిలీ ప్యాక్‌ బాక్సులు సంబంధిత అధికారులు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.

- జిల్లా కేంద్రంలోని కేఎల్‌పురం సమీపంలో తాత్కాలిక బాణసంచా షాపు ఏర్పాటు చేసుకోవడానికి ఓ వ్యాపారి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు కూడా ప్రభుత్వానికి చెల్లించినా చలానా కంటే ఇతర ఖర్చులు దాదాపు రూ.30 వేలు అయ్యాయి.

- బొబ్బిలి పట్టణంలో కొంతమంది వ్యాపారులు కలిసి దాదాపు ఆరు తాత్కాలిక షాపులు ఏర్పాటుకు అనుమతి పొందారు. ఈ వ్యాపారులు కూడా ప్రతి షాప్‌నకు రూ.25వేల నుంచి రూ30 వేలు చొప్పున అధికంగా ఖర్చు పెట్టినట్లు తెలిసింది.

ఇటువంటి పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల ఉంది. ప్రతి మండలంలో మూడు నుంచి ఐదు తాత్కాలిక బాణసంచా షాపుల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత వ్యాపారులు శనివారం షాపులు పెట్టుకుని విక్రయాలు ప్రారంభించారు. ఆది, సోమవారాల్లో కూడా విక్రయాలు చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో లైసెన్స్‌ షాపులు సుమారు 12 వరకూ ఉండగా, తాత్కాలిక షాపులు 56 వరకూ ఉన్నాయి. పట్టణంలోని కేఎల్‌ పురం వద్ద ఎక్కువగా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేశారు. సాధారణంగా తాత్కాలిక దుకాణం ఎవరైనా పెట్టాలంటే ముందుగా వారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే షాపు ఏర్పాటు చేస్తారో? ఆ స్థలానికి సంబంధించిన 1బీ, ఆధార్‌ జిరాక్స్‌ను దరఖాస్తుకు జత చేయాలి. తరువాత అగ్ని మాపక శాఖకు రూ.500, పోలీసు శాఖకు రూ.500, రెవెన్యూ శాఖకు రూ.50 చొప్పున చలానా తీయాలి. పోలీసు, అగ్ని మాపక శాఖ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారు. మండల రెవెన్యూ అధికారులు రెవెన్యూ డివిజన్‌ అధికారికి పంపిస్తారు. అక్కడ అనుమతి పొందిన తరువాత షాపును వారు ఎంచుకున్న స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తంగా చలానా, ఆన్‌లైన్‌ తదితర ఖర్చులు కలిపి దాదాపుగా రూ.1500 అవుతుంది. కానీ, జిల్లాలో అనుమతి పొందడానికి ప్రతి షాపు యజమాని రూ.20 నుంచి రూ.30 వేలు వరకూ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. డబ్బులే కాకుండా బాణసంచా సామగ్రి కూడా అధికారులకు ఇవ్వాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన దుకాణాలను రెండు, మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ ఖర్చును వినియోగదారుల నుంచి రాబట్టుకునే పనిలో పడ్డారు. దీనికోసం బాణసంచా ధరలను అధికంగా పెంచి విక్రయిస్తున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:14 AM