If you pay, you pass! పైసలిస్తే పాస్!
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:21 AM
If you pay, you pass!
పైసలిస్తే పాస్!
పరీక్షలను అపహాస్యం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు
గుట్టుగా సాగుతున్న వ్యవహారం
అధికారుల సహకారం ఉండడంతో నష్టపోతున్న మిగతా విద్యార్థులు
తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రగతి డిగ్రీ కళాశాల వ్యవహారం
సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన వీడియో
శృంగవరపుకోట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి):
మొదటి విద్యార్థి: పరీక్ష హాలులో నిన్నటిలా వదిలేస్తే బాగుంటది
రెండో విద్యార్థి: మనలో చాలా మంది గోల చేస్తున్నారు. అరిస్తే కష్టం కదా
మొదటి విద్యార్థి: డబ్బులు తీసుకుంటున్నారు ఆమాత్రం వదలరా?
రెండో విద్యార్థి: ఎంత డబ్బులు తీసుకున్నా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా?
మొదటి విద్యార్థి: డిగ్రీ పరీక్షలు మధ్యాహ్నం బాగా అవుతున్నాయి.
రెండో విద్యార్థి: ఏటి రాసేస్తావు? చూసిరాయాలి కదా? ఒకదానికి ఒకటి రాసేస్తే ఇబ్బంది అవుతుంది.
మొదటి విద్యార్థి: మూడు గంటల్లో పది ప్రశ్నలను చూసి రాయలేమా? మీదగ్గర ఎంత తీసుకున్నారు?
రెండో విద్యార్థి: రూ.4వేలు తీసుకున్నారు. నా దగ్గర కూడా అంతే తీసుకున్నారు.
మొదటి విద్యార్థి: మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి. ఒక పేపర్‌లో కనీసం నాలుగైనా రాయాలి కదా?
రెండో విద్యార్థి: ముందు, వెనకా కలిపి రెండు జవాబులు.. ఇటు రెండు, ఇవి రెండు సరిపోతాయి.
మొదటి విద్యార్థి: సబ్జెక్టు ఏంటి మాస్టారు?
రెండో విద్యార్థి: ఇంగ్లీషు. మరి నీది?
మొదటి విద్యార్థి: నాది మేథ్స్.
రెండో విద్యార్థి: ఓ.. మేథ్స్ అయితే ఎక్కువ డబ్బులు తీసుకోవాలే.
మొదటి విద్యార్థి: అతను నాకు తెలుసు.
రెండో విద్యార్థి: అందుకే మీకు తక్కువ డబ్బులు.. పోతే పోనీ పాస్ అయిపోతే చాలు.
- ఇదీ కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల సమీపంలో జిరాక్స్ సెంటర్ వద్ద ఇద్దరు విద్యార్థుల మధ్య సాగిన సంభాషణ. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగంలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కొత్తవలస ప్రగతి డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రశ్న పత్రాన్ని ముందుగా లీక్ చేయడంతో వాటికి సంబంధించిన జవాబు పత్రాలను చూసి రాసేందుకు మైక్రో జిరాక్స్‌లను తీసుకువెళ్తున్నారు. జిరాక్స్ తీసుకొనేందుకు వచ్చిన విద్యార్థులు చూచి రాతకు కళాశాల యాజమాన్యానికి ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చారో ఒకరికొకరు చెప్పుకున్నారు. వారు గమనించకుండా దీన్ని మరొకరు వీడియో తీసేశారు. దీంతో పరీక్షకేంద్రంలో జరుగుతున్న మాస్ కాపీయింగ్ బయటపడింది. దూర విద్య పరీక్షల నిర్వహణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం డోల్లతనంపైనా చర్చ నడుస్తోంది. అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.
ఈ పరీక్షలే కాదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న పరీక్షలన్నీ దాదాపు ఈ విధంగానే జరుగుతున్నాయి. గత ఏడాది ఇంటర్ ఓకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు శృంగవరపుకోట పట్టణంలోని ఓ కేంద్రంలో పనిచేయాల్సిన ఇన్విజిలేటర్ మరో కేంద్రంలో తనిఖీలకు వచ్చిన జిల్లా అధికారికే కనిపించారు. ఇక్కడెందుకున్నావని అడిగి ఊరుకోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏ పరీక్షలు జరిగినా ఇదే తీరు. సంబంధిత విద్యాశాఖాధికారుల సహకారంతో చూచి రాయించేయడం ఆనవాయితీగా మారింది. పదోతరగతి, ఇంటర్ పరీక్షలను ప్రైవేటుగా రాసే సార్వత్రిక పరీక్షల్లో విద్యార్థికి బదులు వేరొకరితో రాయించేస్తున్నా అధికారులకు పట్టదు. ఈ విధంగా పైసలు ఇస్తే పాస్ చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ యాజమాన్యాలు కల్పిస్తున్నాయి.
- బీఈడీ, ఎంఈడీ పరీక్షలను కూడా చూచి రాయించేస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ప్రగతి కళాశాలలో ప్రవేశాలు పొందుతున్నారు. వారు తరగతి గదుల్లో కనిపించరు. పరీక్ష కేంద్రంలో మాత్రమే కనిపిస్తారు. పాఠ్యాంశానికి ఓ రేటు పెట్టి మాస్ కాపీయింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఒకేషనల్, దూర విద్య పరీక్షలకు విద్యార్థికి బదులు మరో తెలివైన విద్యార్థితో రాయిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు కొదవ లేదు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల నుంచి రూ.10వేల వరకు ఒక్కో సబ్జిక్టుకు తీసుకుంటున్నారు. వేర్వేరు పనులు చేసుకుంటున్నవారు కొందరైతే, పదోన్నతలు పొందేందుకు చదువుతున్న వారు మరికొందరు. రిగ్యులర్ విద్యార్థుల్లో చదవులో వెనకబడిన వారు ఏదో విధంగా పాస్ అయ్యేందుకు యాజమాన్యాలు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఇన్విజిలేటర్ నుంచి పరీక్షల నిర్వహణతో సంబంధం వున్న అధికారులందరికీ పంచడంతో వీరంతా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల తెలివైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. వీరితో పాటు చూసి రాసి మంచి మార్కులు తెచ్చుకుంటుండడంతో ఉన్నత విద్యాప్రవేశాలు, మార్కుల ప్రాతిపాదికన వచ్చే ఉద్యోగాల్లో బాగా కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతోంది.
- ప్రైవేటు విద్యాసంస్థలన్నీ ఎత్తయిన ప్రహరీ మధ్య బహుళ అంతస్తుల భవనాల్లో ఉంటున్నాయి. గేటు నుంచి కనీసం వెయ్యి అడుగులు దూరంలో వుండే ఈ గదులకు చేరుకొనేటప్పటికే మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులు సర్దేసుకుంటున్నారు. దీనికి ముందే సంబంధింత అధికారి వస్తున్నట్లు యాజమాన్యానికి సమాచారం అందుతోంది.