Share News

డబ్బులిస్తే ఉద్యోగం!

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:34 PM

వారంతా వేర్వేరు జిల్లాలకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు. ఒకరి ద్వారా ఒకరికి.. ఇలా అందరికీ పరిచయమయింది.

డబ్బులిస్తే ఉద్యోగం!
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

- ప్రభుత్వశాఖల్లో కొలువులంటూ రూ.53 లక్షల వసూలు

- తరువాత పత్తాలేకుండా పోయిన వైనం

- పోలీసులను ఆశ్రయించిన బాధితులు

- నలుగురి అరెస్టు.. మరో నలుగురు పరారు

విజయనగరం క్రైం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): వారంతా వేర్వేరు జిల్లాలకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు. ఒకరి ద్వారా ఒకరికి.. ఇలా అందరికీ పరిచయమయింది. అంతా కలిసి వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలంటూ నకిలీ అపాయింట్‌మెంటు లేఖలు, ఐడీ కార్డులను స్టేటస్‌ల్లో పెట్టేవారు. వీటిని చూసి నమ్మిన కొందరు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వారికి రూ.లక్షలు చెల్లించారు. తీరా ఉద్యోగం అడిగితే రేపుమాపు అంటూ ఆ తొమ్మిది మంది మూడేళ్ల పాటు కాలక్షేపం చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విజయనగరం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలను వెల్లడించారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి సాయివెంకట సుజిత్‌, విజయనగరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన చెక్కా మహేష్‌, తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డి గూడేంనకు చెందిన నైనారపు చేతన్‌ రూబిన్‌కుమార్‌, ఏలూరుకు చెందిన గుంటూరు జాన్‌, ఏలూరు జిల్లా గొల్లాయిగూడెంనకు చెందిన కలపల యాకోబ్‌, శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, శేషగిరిరావు, లక్ష్మీనారాయణ రెడ్డి గ్రూప్‌గా ఏర్పడ్డారు. తమ వాట్సాప్‌ స్టేటస్‌ల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఎస్‌.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన సిరికి వినోద్‌, లోతోటి జ్యోతి, పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన తాటిపూడి జయరాజ్‌, అదే మండలానికి చెందిన కొవ్వాడ జాషువా.. సుజిత్‌ను సంప్రదించారు. దీంతో సుజిత్‌, తమ గ్రూప్‌ సభ్యులు కలిసి బాధితుల నుంచి 2022 నుంచి 2024 వరకూ అంచెలంచెలుగా రూ.53 లక్షలు వసూలు చేశారు. అలాగే ముత్యాల రామచంద్రరావు, కొరుప్రోలు శివకుమార్‌ అనే నిరుద్యోగులు కూడా వీరి బారిన పడ్డారు. తమకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని నిరుద్యోగులు నిలదీయగా.. డబ్బులు తీసుకున్న వారు అమరావతి సెక్రటరియేట్‌కు గతేడాది తీసుకువెళ్లారు. అక్కడ రెవెన్యూ, అటవీశాఖ, రైల్వే, సాంఘిక సంక్షేమ శాఖల్లో ఔట్‌ సోర్సింగుల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆ శాఖలను చూపించి కొంత సమయం పడుతుందని కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. ఆ తరువాత పత్తాలేకుండా పోవడంతో ధర్మవరానికి చెందిన సిరికి వినోద్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుజిత్‌పై విజయనగరం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు విచారణను వేగవంతం చేశారు. ఇటీవల సుజిత్‌ అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు. అతని ద్వారా మిగిలిన నిందితులకు ఫోన్‌ చేయించారు. దీంతో సుజిత్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చిన చెక్కా మహేష్‌, నైనారపు చేతన్‌ రూబిన్‌ కూమార్‌, గుంటూరు జాన్‌, కలపల యాకోబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌ తరలించి విచారించారు. దీంతో మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. సుజిత్‌ ఆసుపత్రిలో ఉండగా, శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, శేషగిరిరావు, లక్ష్మీనారాయణ రెడ్డి పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈ గ్యాంగ్‌ పలు జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైందని అన్నారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శ్రీనివాసరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jun 07 , 2025 | 11:34 PM