If You Overcome Fear, Success Is Yours! భయం వీడితే.. విజయం మీదే!
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:21 AM
If You Overcome Fear, Success Is Yours! గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయతీరాన్ని చేరవచ్చు. భయం వీడితే అత్యధిక మార్కులు సొంతం చేసు కోవచ్చు. అసలు లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్‌మెంట్, కూడికలు, తీసివేతలు.. ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమై పోయాయి.
సాధనతో ఈజీ అంటున్న ఉపాధ్యాయులు
నేడు గణిత దినోత్సవం
గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయతీరాన్ని చేరవచ్చు. భయం వీడితే అత్యధిక మార్కులు సొంతం చేసు కోవచ్చు. అసలు లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్‌మెంట్, కూడికలు, తీసివేతలు.. ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమై పోయాయి. కాంపిటేటివ్ ప్రపంచంలో నెగ్గాలన్నా లెక్కలు కీలకం. ఈ సబ్జెక్టును సాధన ద్వారా సులువుగా నేర్చుకోవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్తగా విద్యార్థులకు గణితం బోధిస్తూ.. సత్ఫలితాలు సాధిస్తున్నారు జిల్లాలో కొందరు టీచర్లు. నేడు గణిత దినోత్సవం (గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి) సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి ’ప్రత్యేక కథనం
మ్యాథ్స్‌క్లబ్‌తో గణితంపై భయం పొగొట్టి..
సాలూరు రూరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల్లో గణితంపై భయం పొగొట్టేందుకు రామానుజన్ మ్యాథ్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించారు రంభ రజనీకాంత్ మాస్టారు. ఆయన సాలూరు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడి (పీఎస్ హెచ్‌ఎం)గా పనిచేస్తున్నారు. 2001లో తన మిత్రులతో కలిసి స్థాపించిన రామానుజన్ మ్యాథ్ క్లబ్ ఏర్పాటుచేశారు. నాటి నుంచి ఈ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గణితంపై ప్రతిభ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక టెన్త్ విద్యార్థులకు మ్యాథ్స్ ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఏటాలానే ఈ సారి కూడా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి రోజున విజేతలైన విద్యార్థులను సత్కరించి బహుమతు లందించనున్నారు. ‘ ఈ మ్యాథ్స్ క్లబ్ వల్ల విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెరుగుతుంది. ఏటా నిర్వహించే ప్రతిభ పరీక్షల్లో విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తున్నారు. అని వ్యవస్థాపకుడు రజనీకాంత్, కార్యదర్శి వెంకట గౌరీశంకరరావు ఆదివారం చెప్పారు.
గణితంతోనే జీవితం
సమాజంలో అందరి జీవితం గణితంతో ముడిపడి ఉంటుందని బొడ్డవలస బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో పనిచేస్తున్న గణిత అధ్యాపకుడు మూడడ్ల తిరుపతి రావు(ఎంటీఆర్) అన్నారు. అంతరిక్ష రంగంలోను ఆవిష్కరణలకు గణితమే ప్రధాన భూమిక అని తెలిపారు. ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్ ఆవిష్కరణలు ఇప్పటికీ గణితాన్ని శాసిస్తున్నాయన్నారు. ‘గణితం అంటే కష్టమనే అపోహతోనే విద్యార్థుల్లో అనవసర భయం నెలకొంటోంది. ఇది వాస్తవం కాదు. గణితంపై భయం వీడి ఆసక్తి కనబర్చితే అన్ని సబ్జెక్టుల కంటే చాలా సులభంగా కనిపిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో శతశాతం మార్కులు సాధించగల ఏకైక సబ్జెక్ట్ అదే. పాఠశాలకు రాక ముందే నుంచే విద్యార్థి జీవితంలో గణితం ముడి పడి ఉంటుంది. దుకాణాలకు వెళ్లి సరుకులు కొనడం, తిరిగి చిల్లర తీసుకోవడం తదితర అంశాలతో ఆసక్తిగా గణితం బోధిస్తే విద్యార్థులు శ్రద్ధగా వింటారు. పరిసరాల్లో దొరికే రాళ్లు, ఆకులతో లెక్కింపు, కూడికలు, తీసివేత ప్రక్రియలను నేర్పిస్తే గణితంపై ఆసక్తి పెరుగుతుంది. పెద్ద తరగతుల విద్యార్థులకు ప్రతి చాప్టర్‌కు సంబంధించి అభ్యాసన లెక్కలు ఎక్కువగా చేయిస్తే గణితంపై పట్టు వస్తుంది. లెక్కన సాధన, ఆసక్తిగా మ్యాథ్‌మ్యాజిక్ వంటి ఫన్ యాక్టివిటీస్ చేయించాలి. గణితంపై విద్యార్థికి ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు.’ అని ఆయన తెలిపారు.