problems at subregister officeరైటర్‌తో వెళ్తే రైట్.. రైట్
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:14 AM
If you go with the writer, right.. right రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు సహజంగానే కాస్త బిడియంగా కనిపిస్తారు. తాము అడిగిన సందేహాలకు అధికారులు సరిగా జవాబిస్తే పొంగిపోతారు. పని అయిపోతుందని ముందే సంతృప్తి పడతారు. అలాకాకుండా అధికారులు కసురుకుంటే.. చిన్న విషయానికీ చీదరించుకుంటే పని సంగతి తర్వాత ముందు మానసికంగా బాధపడతారు.

రైటర్‌తో వెళ్తే రైట్.. రైట్
ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సామాన్యులకు అవస్థలే
దురుసుగా ప్రవర్తిస్తున్న ఉద్యోగులు.. కనీస గౌరవం ఇవ్వని వైనం
గతంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా మారని తీరు
రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు సహజంగానే కాస్త బిడియంగా కనిపిస్తారు. తాము అడిగిన సందేహాలకు అధికారులు సరిగా జవాబిస్తే పొంగిపోతారు. పని అయిపోతుందని ముందే సంతృప్తి పడతారు. అలాకాకుండా అధికారులు కసురుకుంటే.. చిన్న విషయానికీ చీదరించుకుంటే పని సంగతి తర్వాత ముందు మానసికంగా బాధపడతారు. శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇదే జరుగుతోంది. అక్కడకు వెళ్లాలంటే అమ్మో అంటున్నారు. డాక్యుమెంట్ రైటర్ తోడు ఉంటేనే అధికారులు, సిబ్బంది మాట్లాడుతున్నారు. లేకుంటే సామాన్యులకు అవస్థలే. ఇక్కడి సిబ్బంది తీరుపై గతంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా మార్పు రాలేదు.
శృంగవరపుకోట, మార్చి 20(ఆంధ్రజ్యోతి):
- వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన భూమిని గంట్యాడ మండలం మోకాలుపాడు గ్రామానికి చెందిన మరో రైతు కొనుగోలు చేశాడు. 2024 డిసెంబరులో శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈభూమికి రిజిస్ర్టేషన్ జరిగింది. కొన్న వ్యక్తి ఇటీవల యాజమాన్య హక్కుల కోసం వేపాడ మండల రెవెన్యూ అధికారులను కలిసాడు. ‘మీరు రిజిస్ర్టేషన్ చేసుకున్న సమయానికి ఆటోమ్యూటేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, అయినా ఎందుకు మ్యూటేషన్ కాలేదని రెవెన్యూ అధికారులు తిరిగి రైతును ప్రశ్నించారు. ఎందుకు మ్యూటేషన్ అగిందో తెలుసుకుని రావాలని సూచించారు. దీంతో ఆ రైతు తెలిసిన వ్యక్తిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించి తన సందేహాన్ని అడిగించారు. ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్ సంధ్యాకల్యాణి మాట్లాడుతూ దీనిపై రెవెన్యూ అధికారులనే అడగాలని బదులిచ్చారు. మ్యూటేషన్లు అక్కడే జరుగుతాయని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు ఎదురుగా వున్న సీనియర్ అసిస్టెంట్‌ను డౌట్ అడిగారు. రిజిస్ట్రేషన్ జరిగిన ప్రతి డ్యాక్యుమెంట్ ఆటో మ్యుటేషన్ జరగాలన్న రూలేమీ లేదని ఆయన కూడా దురుసుగా సమాధానం ఇచ్చారు.
- మూడు నెలల కిందట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఓ కారు పార్కింగ్ చేసి ఉంది. జిల్లా అధికారులు వస్తున్నారని, కారును ఇక్కడి నుంచి తీయాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తహసీల్దార్ ఎం.అరుణకుమారి కబురు పంపించారు. అంతే ఈ కారుకు సంబంధించిన ఉద్యోగికి అంతమాత్రానికే కోపం వచ్చేసింది. ‘మా కార్యాలయం ఎదురుగా పార్కింగ్ చేసుకున్న కారును తీయాలనడానికి మీరెవరంటూ తహసీల్దార్‌ను ఎదురు ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్ ఎస్‌ఐను పిలిపించి కారు తీయించాల్సి వచ్చింది. మండల సెకెండ్ క్లాస్ మేజిస్టేట్ హోదా కలిగిన తహసీల్దార్ మాటనే లెక్క చేయని ఎస్.కోట సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు సామాన్యుల విషయంలో ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ ప్రభుత్వంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారన్న అపవాదు ఉంది. డబ్బులు చేతికందే భూ రిజిస్ట్రేషన్‌లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలా తీసుకున్న డబ్బులో కొంత అప్పటి ప్రజాప్రతినిధులకు వాటాలు ఇవ్వడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు ఏం చేసినా అడిగేవారు కాదు. సామాన్య రైతు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వ్యయ, ప్రయాసలకు వార్చాల్సిందే. ఈ పరిస్థితిలో సంవత్సరాలుగా మార్పు రావడం లేదు. ఇదిలా ఉండగా వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామానికి చెందిన అసైన్డ్ భూములకు గత వైసీపీ ప్రభుత్వం భూయాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. ఈ భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరిగాయి. జిల్లాలో ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరగని విధంగా అత్యధిక ఎకరాలకు క్రయ, విక్రయాలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై విచారణ జరిపిస్తోంది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌లో ఇక్కడ అవకతవకలు జరిగినట్లు స్వయంగా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి సిసోడియా గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేశారు. కొత్తగా వేర్వేరు ప్రాంతాల నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. అయినా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న వారి తీరు మారలేదు.
దురుసుగా సమాధానం
కార్యాలయానికి వచ్చేవారికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మర్యాదగా మాట్లాడడం లేదు. పనేంటని సౌమ్యంగా అడగాల్సిన సిబ్బంది ఎందుకు వచ్చారంటూ గద్దిస్తున్నారు. సీరియస్‌గా చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ సంబంధిత పనుల కోసం వచ్చేవారు భయపడేలా దురుసుగా మాట్లాడుతున్నారు. డాక్యుమెంట్ రైటర్‌లతో వెళ్తేనే అధికారుల వద్ద నిలబడగలుగుతున్నారు. రైటర్ల సహకారం లేకుండా భూ క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదు. డాక్యుమెంట్ తయారు చేసి వారు తీసుకెళ్లిన తరువాతే రిజిస్ట్రేషన్‌లకు సమ్మతిస్తున్నారు.
- ఉద్యోగుల దురుసు ప్రవర్తనపై వివరణ అడిగేందుకు సబ్ రిజిస్ట్రార్ సంధ్యా కల్యాణిని ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించగా ఎటువంటి సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేశారు.