Share News

If you drive drunk, you will go to jail! తాగి వాహనం నడిపితే జైలుకే!

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:14 PM

If you drive drunk, you will go to jail!శృంగవరపుకోట ఎస్‌ఐ ఎల్‌.చంద్రశేఖర్‌ నాలుగురోజుల కిందట శివరామరాజుపేట కూడలి వద్ద వాహన తనిఖీ చేపట్టగా ఇదే గ్రామానికి చెందిన కె.అప్పారావు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి స్థానిక స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

If you drive drunk, you will go to jail! తాగి వాహనం నడిపితే  జైలుకే!

తాగి వాహనం నడిపితే

జైలుకే!

పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీస్‌లు

వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారు చేస్తున్న కోర్టులు

ప్రమాదాలకు కారణమవుతుండడంతో తీవ్రంగా పరిగణింపు

శృంగవరపుకోట నవంబరు 16(ఆంధ్రజ్యోతి):

- శృంగవరపుకోట ఎస్‌ఐ ఎల్‌.చంద్రశేఖర్‌ నాలుగురోజుల కిందట శివరామరాజుపేట కూడలి వద్ద వాహన తనిఖీ చేపట్టగా ఇదే గ్రామానికి చెందిన కె.అప్పారావు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి స్థానిక స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

- జామి ఎస్‌ఐ వీరజనార్ధన్‌ వారం కిందట విసినిగిరి కూడలి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా స్కూటీపై వస్తున్న ఎస్‌.కోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన ఎన్‌.ఎర్రినాయుడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి ఎస్‌.కోట స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ ముందుకు తీసుకువెళ్లారు. విచారణలో తాగి వాహనం నడిపినట్లు ఒప్పుకోవడంతో ఏడు రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు.

మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై పోలీస్‌లు విరివిగా కేసులు నమోదు చేస్తున్నారు. కోర్టులు కూడా వెంటనే వారం రోజుల పాటు జైలు శిక్షను ఖరారు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఎస్పీ ఏఆర్‌దామోదర్‌ స్వయంగా ఇటీవల తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతుండడంతో తాగి బండి నడపడాన్ని పోలీస్‌లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జిల్లాలో మద్యం సేవించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. మద్యం సేవించి వాహనాలను నడుపుతారన్న కారణంతో జాతీయ రహదారులు, పాఠశాలలు, దేవాలయాల సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయకుండా నిబంధనలను విధించింది. తాగి వాహనాలను నడపొద్దంటూ విస్తృత ప్రచారం కూడా చేస్తోంది. అయినా మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారు. ప్రస్తుతం రోడ్లపై ద్విచక్రవాహనాలతో ప్రయణిస్తున్న వారిలో సగానికి పైబడి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నవారే. పూర్తి స్థాయిలో పోలీస్‌ శాఖ నిఘా పెడితే రోజుకు జిల్లా వ్యాప్తంగా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో పట్టుబడటం ఖాయం. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన మద్యం దుకాణ యజమానులు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జాతీయ రహదారుల మినహా మిగిలిన రహదారులకు ఆనుకుని మద్యం దుకాణాలను నడుపుతున్నారు. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే రహదారులకు కాస్త దూరంగా ఉంటున్నాయి. దాదాపు అన్ని మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుకూలవాతావరణం ఉంది. కొన్ని చోట్ల మద్యం దుకాణాలకు సమీపంలో దాబాలు ఉన్నాయి. అయితే పూటుగా మద్యం తాగిన వారంతా గమ్యస్థానాలకు చేరుకోనేందుకు వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. మద్యం మత్తులో వారంతట వారే కిందపడుతున్నారు. రోడ్డుపక్కనున్న పొలాల్లోకి వెళ్లేవారు కొందరైతే, చెట్టునో, డివైడర్‌నో, గట్టునో ఢీకొట్టేవారు మరికొందరు. ఇంకొందరు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్నో, ముందున్న వాహనాన్నో బలంగా ఢీకొడుతున్నారు. వీరితో పాటు అకారణంగా మిగిలినవారి ప్రాణాలను బలిగొంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఇటీవల కాలంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తిస్తే వెంటనే కేసు నమోదు చేస్తున్నారు. ఆపై కోర్టులకు తరలిస్తున్నారు. గతంలో జరిమానాతో సరిపెట్టిన కోర్టులు ఇప్పుడు జైలు శిక్ష విధిస్తున్నాయి. జైలు శిక్ష విధిస్తే మార్పు వస్తుందని భావించి పాతరోజుల్లో రెండు లేదా మూడు రోజులు శిక్షలు విధించేవారు. అనుకున్న స్థాయిలో మార్పు కనిపించడంతో ఇప్పుడు ఏడు రోజుల పాటు జైలులో ఉండేలా శిక్షను అమలు చేస్తున్నారు. దీంతోనైనా తాగి వాహనం నడిపేవారు తగ్గుతారేమో చూడాలి.

-----------

Updated Date - Nov 16 , 2025 | 11:14 PM