Share News

If you don't wake up.. Danger మేల్కొనకపోతే.. ముప్పే!

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:05 AM

If you don't wake up.. Danger రాచపుండు.. క్యాన్సర్‌!... నెమ్మదిగా శరీరాన్ని రోగగ్రస్తం చేసే రాకాశి.. పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి.

If you don't wake up.. Danger మేల్కొనకపోతే.. ముప్పే!

మేల్కొనకపోతే.. ముప్పే!

జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు

ముందస్తు పరీక్షల్లో నిర్ధారణ

5,968 బాధితుల గుర్తింపు

రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం

పాలిథిన్‌ కవర్లతోనూ అపాయం

ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టని పాలకులు

విజయనగరం రింగురోడ్డు/రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి):

రాచపుండు.. క్యాన్సర్‌!... నెమ్మదిగా శరీరాన్ని రోగగ్రస్తం చేసే రాకాశి.. పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన స్ర్కీనింగ్‌ పరీక్షల్లో విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం జిల్లాల్లో క్యాన్సర్‌ రోగులు అధికంగా ఉన్నట్లు తేలింది. విజయనగరం జిల్లా రెండోస్థానంలో ఉంది. కాకినాడలో 6,333 కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో 5,968 కేసులు నమోదయ్యాయి. జన్యుపరమైన కారణాలతో కూడా క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అలాగే పొగాకు, మత్తుపదార్థాలు వినియోగించే వారు కూడా క్యాన్సర్‌ వ్యాధికి గురవుతున్నారు. జిల్లాలో నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ బాధితులు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా క్యాన్సర్‌ శరీరంలో ప్రవేశించినా చాలా మంది సకాలంలో గుర్తించడం లేదు. ఈ వ్యాధిపై అవగాహన లేక క్యాన్సర్‌ ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి తప్పకుండా కోలుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

స్ర్కీనింగ్‌ పరీక్షలు ఇలా..

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. జిల్లాలో 6,41,342 గృహాలు ఉండగా జనాభా 15,65,721 మంది ఉన్నట్లు అంచనా. ఇప్పటి వరకూ 4,58,722(71.53 శాతం) మందికి సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల్లో నోటి క్యాన్సర్‌ 3,390 మందికి, రొమ్ము క్యాన్సర్‌ 1,764, గర్భాశయ క్యాన్సర్‌ (సర్వేకల్‌ క్యాన్సర్‌) 1,534 ఉన్నట్టు గుర్తించారు.

పాలిథిన్‌ కవర్లతో అపాయం

మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు లేని రాజాంకు చెందిన ఓ వ్యాపారి రోజూ రెండుమూడుసార్లు కవర్లలో తెచ్చిన టీని తాగేవాడు. ఇటీవల కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో రాజాంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. కేన్సర్‌ లక్షణాలున్నాయని అనుమానం ఉందని వైద్యులు స్పష్టం చేయడంతో అనకాపల్లి సమీపంలో అగనంపూడి వద్ద ఉన్న కేన్సర్‌ ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షల అనంతరం కేన్సర్‌ తొలిదశలో ఉందని నిర్ధారించారు. ముందుగా మేల్కొనడంతో అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.

- కర్ణాటకలో హోటళ్లు, రెస్టారెంట్లలో పాలిథిన్‌, ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తూ.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన తోపుడుబళ్లలోని ఆహారపదార్థాల శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. 35 చోట్ల తయారైన వాటిల్లో కేన్సర్‌ కారకాలు ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధారించారు. దాదాపుగా ఇదే పరిస్థితి మన జిల్లాలోనూ ఉంది.

వైద్యులు హెచ్చరిస్తున్నా..

అధికారులు ఎన్ని దాడులు నిర్వహించినా, ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, జరిమానాలు విధించినా జిల్లా వ్యాప్తంగా పాలిథిన్‌, ప్లాస్టిక్‌ వినియోగంలో ఏమాత్రం మార్పు రాలేదనేది అధికారులకూ తెలిసిందే. పొగలు కక్కే టీ, సాంబార్‌, రసం, పప్పు, కూరలు ప్లాస్టిక్‌ కవర్లలో వేసి అమ్మకాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చాలామంది అలాంటి వాటినే కొని తెచ్చుకుంటున్నారు. ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్డ్‌) కవర్లు, టీ కప్పులపై నిషేధం ఉన్నా తనిఖీలు నామమాత్రంగా ఉండడంతో రోజురోజుకూ వినియోగం పెరుగుతోంది.

ఇవిగో ప్రత్యామ్నాయాలు..

భోజనాలకు పర్యావరణ హితమైన విస్తరాకులు, అరిటాకులు వినియోగించే అవకాశం ఉంది. చికెన్‌, మటన్‌, కూరలు, రసం, సాంబార్‌ వంటి వేడివేడి పదార్థాల కోసం కర్రీ పాయింట్లకు స్టీల్‌ డబ్బాలు తీసుకువెళ్లొచ్చు. టీ, కాఫీ, వేడి పాలు కోసం సైతం చిన్నపాటి స్టీల్‌ బాటిళ్లను వాడే వీలుంది. పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరత్రా వంట దినుసుల కోసం గుడ్డ సంచులు వాడే వీలున్నా వాటిని వినియోగించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

నివారణ మన చేతుల్లోనే

డాక్టరు పి.విజయలక్ష్మీ, మెడికల్‌ అంకాలజిస్ట్‌, ప్రభుత్వ సర్వజనాసుపత్రి

ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తరువాత ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కువగా మత్తు పదార్థాల వినియోగం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకుతోంది. వీటి వినియోగాన్ని ఆపేయాలి. అలాగే 40 ఏళ్లు దాటిన మహిళలు ప్రధానంగా మోమోగ్రఫీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిర్థారించవచ్చు. 11 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీసీవీ వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఏ అనారోగ్య లక్షణమైనా మూడు వారాలకు మించి తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ విభాగం ఉంది. ఇక్కడకు వచ్చి క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవచ్చు.

అనేక దుష్పరిణామాలు

డా.గార రవిప్రసాద్‌, ఎండీ, జనరల్‌ మెడిసిన్‌

ప్లాస్టిక్‌ కవర్లలో తెచ్చిన ఆహారపదార్థాలను తింటే వాటి సూక్ష్మ రేణువులు శరీరంలోకి చేరుతాయి. శిశువుల్లో మెదడు, ప్రోస్టేట్‌ గ్రంధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కేన్సర్‌ బారిన పడే అవకాశాలెక్కువని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో స్పష్టమైంది.

--------

Updated Date - Apr 27 , 2025 | 12:05 AM