Share News

దందాలు చేస్తే ఉపేక్షించేదిలేదు

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:14 AM

ఎవరైనా దందాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు హెచ్చరించారు.

దందాలు చేస్తే ఉపేక్షించేదిలేదు
అధికారులతో మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ శరత్‌బాబు

బొబ్బిలి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా దందాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ లాలం రామలక్ష్మి సమక్షంలో రెవెన్యూ అధికారులు, సచివాలయాల అడ్మిన్‌ సెక్రటరీలు, ఇతర సిబ్బందితో ఆయన సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణ పౌరులందరికీ నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తనకు ఎటువంటి కాసుల కక్కుర్తిలేదని, ఎవరి దగ్గరా ఎటువంటి కమీషన్లను ఆశించనని స్పష్టం చేశారు. ఎవరైనా దందాలు చేస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. మధ్యాహ్న సమయాల్లో సచివాలయాలకు తాళాలు వేసి ఉంటున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, ఈ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రెవెన్యూ విభాగంపై వస్తున్న ఫిర్యాదుల పట్ల, సిబ్బంది పని తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల అడ్మిన్‌ సెక్రటరీలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ కచ్చితంగా ఉదయం 8 గంటలకు విధులకు హాజరు కావాలని, లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. సేవల్లో నాణ్యతను పెంచాలని సూచించారు. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతున్న సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణంలో చెరువుల సంఖ్య, వాటి లీజు వివరాలపై తనకు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఆర్వో నాగరాజు, ఆర్‌ఐ సురేష్‌బాబు, సచివాలయాల అడ్మిన్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:14 AM