If there is a fire, it will be a cheek అగ్గి పుడితే బుగ్గే
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:22 AM
If there is a fire, it will be a cheek రేగిడిలో ఏడుగురు రైతులకు చెందిన 15 ఎకరాల చెరకు తోట రెండు రోజుల కిందట దగ్ధమైంది. రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. పాలకొండ నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపుచేసింది. రాజాంలో ఉన్న వాహనం వెళ్లే సరికి అప్పటికే నష్టం జరిగిపోయింది. రాజాం నియోజకవర్గంలో ఒకే అగ్నిమాపక వాహనం ఉండడంతో ఆపదలో ఉపయోగం ఉండడం లేదు.
అగ్గి పుడితే బుగ్గే
అగ్నిమాపక వాహనాలు కొరత
నియోజకవర్గానికి ఒకటే
కొన్ని శిథిల భవనాల్లోనే నిర్వహణ
సిబ్బంది కొరత
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
రేగిడిలో ఏడుగురు రైతులకు చెందిన 15 ఎకరాల చెరకు తోట రెండు రోజుల కిందట దగ్ధమైంది. రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. పాలకొండ నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపుచేసింది. రాజాంలో ఉన్న వాహనం వెళ్లే సరికి అప్పటికే నష్టం జరిగిపోయింది. రాజాం నియోజకవర్గంలో ఒకే అగ్నిమాపక వాహనం ఉండడంతో ఆపదలో ఉపయోగం ఉండడం లేదు.
రాజాం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి):
రాజాం నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం జరిగితే బాధితులు తేరుకునే పరిస్థితి ఉండడం లేదు. మంటలను అదుపు చేసే అగ్నిమాపక వాహనం అందుబాటులో లేక తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల రేగిడిలో ఓ చెరకు పంట అలాగే కాలిపోయింది. వాహనం వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాలుగు మండలాలకు రాజాంలో ఏకైక అగ్నిమాపక వాహనం ఉంది. అది ఘటనా స్థలానికి వెళ్లేసరికి ఆలస్యమై ఉపయోగం ఉండడం లేదు. గత ఏడాది ఆగస్టు 25న రాజాం పట్టణ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చీపురుపల్లి రోడ్డులో సీతారామ ఆయిల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. రాజాం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు కానీ అదుపులోకి రాలేదు. దీంతో చీపురుపల్లితో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేయాల్సి వచ్చింది. అగ్నిమాపక శాఖ వాహనాలు దగ్గరలో ఉన్నచోట పర్వాలేదు కానీ.. సుదూర ప్రాంతాల్లో ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సిన విషయం. జిల్లాలో 32 మండలాలకుగాను అగ్నిమాపక వాహన కేంద్రాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. దీంతో వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు నియంత్రించడం సిబ్బందికి కత్తిమీద సాములా మారుతోంది. ఒక వైపు వాహనాలు మూలకు చేరగా.. సిబ్బంది కూడా తగిన స్థాయిలో లేరు.
జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, బాడంగి,రాజాం, చీపురుపల్లి, కొత్తవలస, ఎస్.కోటలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాహనాలు దశాబ్దాల కిందట నాటివి. దీంతో తరచూ మొరాయిస్తున్నాయి. అత్యవసర సేవలు అందించే విభాగాలకు వాహనాలు సమకూర్చాల్సి ఉన్నా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గజపతినగరం, చీపురుపల్లి కేంద్రాలకు కొత్త వాహనాలు కావాలని ప్రతిపాదనలు పంపారు. బొబ్బిలి, గజపతినగరంలో కొత్తస్టేషన్ల ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2017 నుంచి 2024 మధ్య జిల్లాలో భారీ అగ్నిప్రమాద ఘటనలు 30 జరిగాయి. మీడియం ప్రమాదాలు మరో 231 వరకూ జరిగాయి. వాస్తవానికి మండలానికి ఒక అగ్నిమాపక కేంద్రం విధిగా ఉండాలి కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు.
అరకొరగా సిబ్బంది
ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు సైతం సిబ్బంది కొరత ఉంది. ఈ వాహనాలకు సంబంధించి అత్యవసర సేవలు అందించేందుకు 26 మంది డ్రైవర్లు అవసరం. కానీ ఉన్నది 18 మంది మాత్రమే. 80 మంది ఫైర్‌మెన్లు ఉండాలి కానీ 49 మంది మాత్రమే ఉన్నారు. ఉద్యోగ విరమణ చెందుతున్న వారిలో కొత్త వారి నియామకం జరగడం లేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా నియమించిన దాఖలాలు లేవు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఒక వైపు అగ్నిమాపక శాఖ విధులు, మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి విధులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంది.
సిబ్బంది కొరత వాస్తవమే
అగ్నిమాపక శాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తున్నాం. జిల్లాకు కొత్తగా అగ్నిమాపక వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం కొత్తగా స్టేషన్లను మంజూరు చేసింది. సిబ్బంది కొరత వాస్తవమే. ఫైర్‌మెన్లతో పాటు డ్రైవర్ల కొరత ఉంది. అయినా సరే ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తున్నాం. కొత్త ఫైరింజన్లతో పాటు కొత్త భవనాలకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధుల విడుదలకు అవకాశం ఉంది. నిరంతరం అప్రమత్తంగానే ఉన్నాం.
- బీవీఎస్ రాంప్రకాష్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, విజయనగరం