Share News

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:08 AM

క్వారీ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి హెచ్చరించారు.

 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
చినగుడబ క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వైశాలి

- సబ్‌ కలెక్టర్‌ వైశాలి

గరుగుబిల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్వారీ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి హెచ్చరించారు. మంగళవారం చినగుడబ పరిధిలోని క్వారీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్వారీ నిర్వహణలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పరిసర గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆదేశాలతో క్వారీ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలిపారు. క్వారీకి ఆనుకుని ఉన్న చెరువులను ఆక్రమించుకోవడంతో పాటు రైతులకు సాగునీరు సరఫరా చేసే జంఝావతి, తోటపల్లి కాలువల పరిధిలో నుంచి నీటిని తరలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయా గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. భారీ వాహనాలు రాకపోకలతో రహదారి మార్గాలు గుంతలమయంతో పాటు దుమ్ము, దూళి నెలకొంటుందని తెలియపర్చారన్నారు. క్వారీకి ఎంతమేరకు అనుమతులు ఉన్నాయి, అలాగే ఎంత విస్తీర్ణం మేర నిర్వహణ చేస్తున్నారన్న సమాచారాన్ని తహసీల్దార్‌ పి.బాల నుంచి తెలుసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. క్వారీ ప్రతినిధులు స్పందిస్తూ.. క్వారీకి సంబంధించిన ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో అనుమతులు ఉన్నాయని సబ్‌ కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఆమె తెలిపారు. క్వారీ ప్రాంతంలో ఘర్షణలకు తావివ్వకుండా ఎస్‌ఐ ఫకృద్ధీన్‌ అవసరమైన బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Dec 17 , 2025 | 12:08 AM