Road Accident రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద మరణిస్తే..
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:16 AM
If the Family Head Dies in a Road Accident డోకులగూడకు చెందిన కొండగొర్రె నగేష్ పోడు వ్యవసాయం చేసుకుని భార్యా, పిల్లలతో హాయిగా జీవనం సాగించే వాడు. అయితే జూలై 9న బ్యాంకు పని నిమిత్తం బైక్‌పై మరొకరితో కలిసి భామిని వచ్చాడు. పని ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న సమయలో బైక్ అదుపుతప్పింది. వాహనం వెనుక నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
ప్రయాణం.. కాకూడదు బతుకు ఛిద్రం
మానవ తప్పిదంతో నేటికీ ఎన్నో ప్రమాదాలు
హెల్మెట్ ధారణ, స్వీయరక్షణతోనే ప్రమాదాలకు దూరం
నేడు రోడ్డు ప్రమాద మృతుల స్మృతి దినం
కుటుంబ పోషణ కష్టం..
భామిని, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): డోకులగూడకు చెందిన కొండగొర్రె నగేష్ పోడు వ్యవసాయం చేసుకుని భార్యా, పిల్లలతో హాయిగా జీవనం సాగించే వాడు. అయితే జూలై 9న బ్యాంకు పని నిమిత్తం బైక్‌పై మరొకరితో కలిసి భామిని వచ్చాడు. పని ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న సమయలో బైక్ అదుపుతప్పింది. వాహనం వెనుక నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడి భార్య లలిత దివ్యాంగురాలు.. కూలి పనులు చేయలేని పరిస్థితి. మగ దిక్కు లేవడంతో నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆమె వాపోయింది. నలుగురు పిల్లల్లో ఒకరు భామిని ఏకలవ్య పాఠశాలలో, నల్లరాయిగూడ, సన్నాయిగూడ పాఠశాలలో మరో ఇద్దరు చదువుతున్నారు. దివ్యాంగ పింఛన్ వస్తున్నా.. అది ఏ మాత్రం చాలడం లేదని, చంటి పిల్లను ఇంటిలో వదిలి బయట పనులకు వెళ్లలేకపోతున్నామని ఆమె పేర్కొంది. తమ కష్టాలను అధికారులు గుర్తించి ఆదుకోవాలని కోరింది.
అంతా అంధకారం..
గరుగుబిల్లి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గిజబ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరడాన ఆదినారాయణ ఖడ్గవలస సముదాయంలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 15న రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి పయనమయ్యారు. అయితే నందివానివలస రహదారి మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అ్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో అంధకారం అలుముకుంది. కుటుంబ పెద్ద మృతిని భార్య మంగమ్మ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కూతుళ్లు ఆమెకు అండగా నిలిచారు. ప్రస్తుతం మంగమ్మ అటు పెట్రోల్ బంకు.. ఇటు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్నారు. తన భర్త హెల్మెట్ పెట్టుకున్నట్లయితే ప్రమాదం నుంచి బయటపడేవారని తెలుపుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
బాధలు దిగమింగుకుని..
మక్కువ రూరల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎర్రసామంతవలసకు చెందిన మండంగి సుబ్బారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. భార్య సుజాత, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవాడు. అయితే ఈ ఏడాది జూన్ 3న అడారు సమీపంలో ట్రాక్టరు బోల్తా పడిన ఘటనలో సుబ్బారావు మృతిచెందాడు. దీంతో భార్యాబిడ్డలు అనాథలైపోయారు. కుమారుడు, కుమార్తెను ఎలాపెంచాలి? ఎలాచదివించాలో సుజాతకు అర్థం కాలేదు. ఆ తర్వాత బాధలన్నీ దిగమింగుకుని కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. తమకు ఎటుంటి ఆస్తులు లేవని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె తెలిపింది. ఇటీవల మంజూరైన ‘తల్లికి వందనం’ నగదు తమకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పింది. ప్రభుత్వం ఆదుకుంటే తమ పిల్లలను మరింత బాగా చదివించుకుంటానని పేర్కొంది.
నిబంధనలు పాటించాలి
లైసెన్స్ లేని వారికి, చిన్నారులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదు. తల్లిదండ్రులు మైనర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఒక బైక్‌పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. మద్యం తాగి బండి నడపరాదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదు. 40 శాతం ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యమే. 40 శాతం రహదారి నిబంధనలు పాటిస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. రోడ్డుప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబం పడే బాధ వర్ణణాతీతం. ఈ విషయాన్ని వాహనదారులు గుర్తు పెట్టుకోవాలి. ప్రయాణంలో ఉన్నా కూడా కుటుంబం గురించి ఆలోచించాలి. నిదానమే ప్రధానం. ఇదే లక్ష్యంతో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుంటారు.
- ఫకృద్ధీన్, ఎస్‌ఐ, గురుగుబిల్లి