If That Moment Pauses.. ఆ క్షణం ఆగితే..
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:06 AM
If That Moment Pauses.. చిన్న సమస్యలు, పలు కారణాలతో జిల్లాలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కన్నవారికి, కట్టుకున్న వారికి తీరని శోకం మిగులుస్తున్నారు. క్షణికావేశంలో బంగారు జీవితాన్ని బలి చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.
బతికుంటే ఏదైనా సాధించొచ్చు
చిన్న చిన్న సమస్యలకు బలవన్మరణానికి పాల్పడం తగదు
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం
సాలూరు రూరల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి ): వ్యక్తిగత కారణాలతో గరుగుబిల్లి మండలం చినగుడబ సచివాలయ ఉద్యోగి ఇటీవల స్వగ్రామం దుప్పలపూడిలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య దూరమైందనే బాధతో 20 రోజుల కిందట సాలూరులో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, రుణ యాప్‌ల కారణంగా అప్పులపాలై పాచిపెంట మండలానికి చెందిన ఓ యువకుడు కొద్దినెలల కిందట జీగిరాం సమీపంలో పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
.. ఇలా చిన్న చిన్న సమస్యలు, పలు కారణాలతో జిల్లాలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కన్నవారికి, కట్టుకున్న వారికి తీరని శోకం మిగులుస్తున్నారు. క్షణికావేశంలో బంగారు జీవితాన్ని బలి చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 186 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో యువత అధిక సంఖ్యలో ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఉన్నది ఒకటే జీవితం. దానిని కాపాడుకోవాలి. క్షణికావేశంలో అమూల్యమైన జీవితాన్ని చేజేతులా కాల్చుకుంటే.. అక్కడితోనే కథ ముగిసిపోతుంది. అందుకే బతికుండి ఏదైనా సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెబుతున్నారు.
మా కడుపుకోత ఎవరికి రాకూడదు
‘ యాప్‌లో అప్పులు, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా మా కొడుకు గంజి నాగరాజు ఆత్మహత్య చేసుకుని మాకు కడుపుకోత మిగిల్చాడు. పెద్ద కొడుకు దుబాయిలో సూపర్‌వైజర్ ఉద్యోగం చేన్నాడు. మా వద్ద ఉండి హోటల్ పనికి సాయమందించే చిన్నకొడుకు చనిపోయి మాకు దూరమయ్యాడు. వాడి ప్రవర్తనను గమనించకపోవడం మా తప్పే. మా కొడుపు కోత ఇంకేవరికి రాకూడదు.’ అని పాచిపెంట మండలం పణుకువలసకు చెందిన గంజి ఆదినారాయణ, సరస్వతి దంపతులు తెలిపారు.
మార్పులు గమనించాలి..
‘ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి ప్రవర్తనలో మార్పులను కుటుంబ సభ్యులు గమనించాలి. ప్రవర్తనలో మార్పులు వచ్చిన వారికి సైకాలజిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇవ్వాలి. జీవన విలువలు, నైపుణ్యాలు తెలియజేయాలి. జీవితం విలువ చెప్పాలి. బతికి సాధించొచ్చనే ఆత్మవిశ్వాసం కలిగించాలి. కుటుంబాల మధ్య అన్యోన్యత పెరగాలి. కుటుంబం జీవన విధానంపై అందరికి అవగాహన ఉండాలి. సమస్యలను పెద్దవిగా చూడకూడదు. ప్రాణం విలువ ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.’ ఏపీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌ల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏవీ రాజశేఖర్ తెలిపారు.