Share News

ఏర్పాటైతే.. బేజారు తప్పినట్టే!

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:20 AM

రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు.

ఏర్పాటైతే.. బేజారు తప్పినట్టే!
రోడ్డుపైనే కూరగాయలు విక్రయం

నియోజకవర్గానికో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి

జిల్లావాసుల్లో చిగురిస్తున్న ఆశలు

పాలకొండ, జూలై 27(ఆంధ్రజ్యోతి): రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. దీంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాస్తవంగా మన్యంలోని రెండు నియోజకవర్గ కేంద్రాల్లో రైతు బజార్లు ఉన్నా.. అవి ప్రజలకు అందుబాటులో లేవు. మరో రెండు నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తిగా రైతు బజార్లు లేవు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారి పంటలను రోడ్ల పక్కనే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో దళారులు , ప్రైవేట్‌ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి .. రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. తక్కువ ధరకు కూరగాయలు, ఇతరత్రా పంటలను కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు నష్టపోగా.. వ్యాపారులు మాత్రం బాగా లాభపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి.. ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సీఎం చంద్రబాబు నాయుడు రైతుబజార్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని విస్మరించింది. దీంతో రైతు బజార్లలో దళారులు, ప్రైవేట్‌ వ్యాపారుల హవా కొనసాగింది. మరోవైపు రైతులు తమ పంటలను రోడ్లు మీద అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గిరిజన రైతులు కూడా తమ అటవీ ఉత్పత్తులను ఆరు బయటే విక్రయించాల్సి వస్తోంది. నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

- జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొండలో నాగవంశపువీధి జంక్షన్‌ వద్ద రైతు బజార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావుడిగా శంకుస్థాపన చేశారు. అయితే నిర్మాణం మాత్రం మరించారు. కురుపాంలో ఇప్పటివరకు రైతు బజారు ఏర్పాటు చేయలేదు. పార్వతీపురంలో రైతుబజారు అందుబాటులో ఉన్నా.. దాని నిర్వహణను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో రైతు బజారులో కొన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి. సాలూరులో 2018లోనే రూ.20 లక్షలతో రైతు బజారు నిర్మించారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై అవగాహన కల్పించకపోవడంతో అది వృథాగా మారింది. దీంతో ఎప్పటిలానే సాలూరులో ప్రధాన రహదారిలో కూరగాయలు, వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

-వీరఘట్టం, పార్వతీపురం, జియ్యమ్మవలస, మక్కువ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య పంటలను సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులు.. అటు వినియోగదారులు లాభపడాలంటే జిల్లాలో చాలాచోట్ల రైతు బజార్లను ఏర్పాటు చేయాల్సి ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సాలూరు, పార్వతీపురంలో ఉన్న రైతు బజార్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి.. పాలకొండ, కురుపాం నియోజకవర్గ కేంద్రాల్లో త్వరితగతిన రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 12:20 AM