Share News

How Can They Study? ఇలా అయితే.. చదివేదెలా?

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:40 PM

If It's Like This... How Can They Study? సీతంపేట ఏజెన్సీలో వివిధ పాఠశాలకు పక్కా భవనాలు లేవు. దీంతో గిరిజన చిన్నారులు చదువుల కష్టాలు తప్పడం లేదు. కొన్ని పాఠశాలలను రేకులషెడ్డుల్లో కొనసాగిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో గిరిజన చిన్నారులను ఆయా బడులకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు.

  How Can They Study? ఇలా అయితే.. చదివేదెలా?
ఎగువదారబ పాఠశాల బయట చిన్నారులకు బోధిస్తున్న సీఆర్‌టీ

  • శిథిలావస్థలో మరికొన్ని..

  • కొన్నిచోట్ల రేకులషెడ్డుల్లోనే బోధన

  • చిన్నారులను వెంటాడుతున్న వసతి సమస్య

  • చదువులకు దూరంగా గిరిబిడ్డలు

  • చోద్యం చూస్తున్న అధికారులు

సీతంపేట రూరల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో వివిధ పాఠశాలకు పక్కా భవనాలు లేవు. దీంతో గిరిజన చిన్నారులు చదువుల కష్టాలు తప్పడం లేదు. కొన్ని పాఠశాలలను రేకులషెడ్డుల్లో కొనసాగిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో గిరిజన చిన్నారులను ఆయా బడులకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలో డ్రాపౌట్లు సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. బడికి దూరమవుతున్న చిన్నారులు కొండపోడు, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి పనుల్లో తల్లిదండ్రులకు చేయూతగా ఉంటున్నారు. కాగా సీతంపేట మండలంలో పూర్తి శిఽథిలావస్థలో ఉన్న మండల పరిషత్‌ పాఠశాలలు 8, జీపీఎస్‌లు 16 వరకూ ఉన్నాయి. వాటి పరిధిలో 270పైగా గిరిజన చిన్నారులు చదువుతున్నారు. అయితే వారిని వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

ఐటీడీఏకు కూతవేటు దూరంలో..

సీతంపేట ఐటీడీఏకు సమీపంలో ఉన్న ఎగువదారబ గ్రామంలో 1986 నుంచి గిరిజన ప్రాథ మిక పాఠశాల (జీపీఎస్‌) నడుస్తోంది. అయితే నేటి వరకు ఆ పాఠశాలకు పక్కా భవనం లేదు. గతంలో పూరిపాకలోను.. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న రేకులషెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఎగువదారబ, గెడ్డగూడ గ్రామాలకు చెందిన 14 మంది పిల్లలు ఈ పాఠశాలలో 1 నుంచి 5వతరగతి వరకు చదువుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు డెప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. సీఆర్‌టీ మోహనరావు, భాషా వాలంటీర్‌ సింహాచలం పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. రేకులషెడ్డు ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉండడంతో చిన్నారులకు ఆరుబయటే ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు.

పొంజాడలో ఇలా ...

గిరిశిఖర గ్రామం పొంజాడలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల కూడా దయనీయ స్థితిలో ఉంది. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. పొంజాడ, జాతాపు పొంజాడ, బీరపాడు గ్రామాలకు చెందిన 24మంది చిన్నారులు చదువుతున్నారు. పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో గిరిజన చిన్నారులు రేకులషెడ్డులోనే చదువులు సాగిస్తున్నారు.

డిప్యూటీ ఈవో ఏమన్నారంటే...

‘సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల సర్వే నిర్వహించాం. మొత్తంగా 40 జీపీఎస్‌లు శిఽథిలావస్థలో ఉన్నట్లు గుర్తించాం. ఈ పాఠశాలలకు పక్కా భవనాల కోసం ప్రభుత్వానికి నివేదించాం.’ అని డిప్యూటీ ఈవో జి.రామ్మోహనరావు తెలిపారు.

Updated Date - Jul 23 , 2025 | 11:40 PM