If it rains... I'll shiver! వర్షం పడితే.. వణుకే!
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:42 PM
If it rains... I'll shiver! చిన్నపాటి వర్షానికే విజయనగరం చివురుటాకులా వణికిపోతోంది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను చుట్టుముడుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరం రూపురేఖలు మారిపోయాయని అప్పటి పాలకులు చెప్పుకొచ్చారు.
వర్షం పడితే.. వణుకే!
జలమయమవుతున్న విజయనగరం
అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
సంవత్సరాలుగా మారని దుస్థితి
విజయనగరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి)
చిన్నపాటి వర్షానికే విజయనగరం చివురుటాకులా వణికిపోతోంది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను చుట్టుముడుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరం రూపురేఖలు మారిపోయాయని అప్పటి పాలకులు చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కనీసం నగర ప్రజల అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతులు కల్పించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మునిసిపల్ ఎన్నికల్లో విజయనగరం నగరపాలక సంస్థను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. దాదాపు అన్ని డివిజన్లలో పాగా వేసింది. కానీ చిన్నపాటి పారిశుధ్య సమస్యనూ పరిష్కరించలేకపోయింది. అపరిష్కృత సమస్యల మాట ఇక చెప్పనవసరం లేదు.
విజయనగరంలో దాదాపు 3.04 లక్షల మంది జనాభా ఉన్నారు. 51.62 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. విద్యల నగరంగా పేరొందింది. చారిత్రక నేపథ్యం ఉంది. కానీ చిన్నపాటి వర్షాలకే వణికిపోతుంటుంది. అస్తవ్యస్తంగా మారుతోంది. కాలువల నిర్వహణ సక్రమంగా లేక ప్రధాన వీధులు, మార్కెట్లు జలమయం అవుతున్నాయి. ఆ సమయంలో నగరవాసులు, నివాసితులు, చిరు వ్యాపారులు పడే బాధలు వర్ణనాతీతం. వర్షం వస్తే ముందుగా వరద నీరు చుట్టుముట్టేది నగరపాలక సంస్థ కార్యాలయానికే. మార్కెట్ ప్రాంతం కావడంతో ఈ కూడలి నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ 157 షాపులతో పెద్ద మార్కెట్ ప్రాంగణం ఉంది. వర్షం పడితే ఆ ప్రాంతమంతా మునిగిపోతుంది.
- ప్రధాన కూడళ్లలో కాలువలు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. సిటీస్టాండ్ దారి, కర్రలబట్టి, మహిళా పార్కు ప్రాంతం, ట్యాక్సీస్టాండ్, నగరపాలక సంస్థ కార్యాలయం కూడలి, న్యూపూర్ణ థియేటర్, సాయిబాబా గుడి, పద్మావతినగర్, వెంకటేశ్వరకాలనీ, ఓంమందిరం, ధర్మపురి, వినాయక్‌నగర్, నాయుడుకాలనీ, దాసన్నపేట, సింగపూర్ సిటీ, ఐస్ ఫ్యాక్టరీ కూడలిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంటోంది. చిన్న వర్షాలకే కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. నడిచేందుకు కూడా వీలుండడం లేదు.
- అప్పడెప్పుడో దశాబ్దాల కిందట అవసరాల మేరకు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రజలు పెరిగారు. వారి అవసరాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగా పారిశుధ్య వ్యవస్థ మెరుగుపడలేదు. దాదాపు నగరంలోని కాలువలన్నీ పెద్ద చెరువుకు అనుసంధానించి ఉన్నాయి. ప్రధాన కాలువ ఆక్రమణలతో కుచించుకుపోయింది. దీనిని అభివృద్ధి చేసేందుకు రూ.3.50 కోట్లతో 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేసేందుకు ప్రతిపాదించారు. పనుల్లో ఎడతెగని జాప్యం జరగడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. మరోవైపు ఆక్రమణలు, పూడికతీత సరిగ్గా లేకపోవడంతో వర్షాలకు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి.
పేరుకే నగరం..
పేరుకే నగరం. కానీ మునిసిపాల్టీ కంటే తీసికట్టుగా మారుతోంది. చిన్నపాటి వర్షానికే నగరం నీటిమయంగా మారుతోంది. వేరే ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఐదేళ్లలో నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశామని గత పాలకులు చెప్పుకునేవారు. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
- అప్పారావు, విజయనగరం
ప్రత్యేకంగా దృష్టిపెట్టాం
నగరంలో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిసారించాం. కాలువల స్థితిగతులను తెలుసుకుంటున్నాం. పూడికతీతతో పాటు ఆక్రమణల తొలగింపు చేపడుతున్నాం. కొత్త కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నగర జనాభాకు తగ్గట్టు పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- కమిషనర్, విజయనగరం నగరపాలక సంస్థ