Share News

If it rains, I will tremble. వర్షం వస్తే వణుకే

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:07 AM

If it rains, I will tremble. చినుకుపడి చంపావతి ఉప్పొంగితే ఆ గ్రామాల వారికి వణుకే. మనుషులు, పశు సంపద కొట్టుకుపోయి బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. వంతెన నిర్మాణం కోసం నాలుగు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు. అయినా ఒక్క అడుగూ పడ లేదు. నేతలు, అధికారుల అలసత్వం ఫలితంగా తాజాగా మరో కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇంటి పెద్ద గల్లంతై ఆచూకీ లభించక టెన్షన్‌ పడుతోంది. ఆగూరు పంచాయతీ రెల్లిగూడెం, సారాడవలస, మల్లెడువలస, సంగంగుడ్డి వలస, గూడెం గ్రామాల ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న కష్టాలివీ..

If it rains, I will tremble. వర్షం వస్తే వణుకే
ప్రమాదకర స్థితిలో నది దాటుతున్న దృశ్యం

వర్షం వస్తే వణుకే

ప్రాణాలు తోడేస్తున్న చంపావతి

ఏటా పశుసంపదకూ భారీనష్టం

వంతెన కోసం దశాబ్దాలుగా నిరీక్షణ

వానాకాలంలో రాకపోకలు బంద్‌

చినుకుపడి చంపావతి ఉప్పొంగితే ఆ గ్రామాల వారికి వణుకే. మనుషులు, పశు సంపద కొట్టుకుపోయి బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. వంతెన నిర్మాణం కోసం నాలుగు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు. అయినా ఒక్క అడుగూ పడ లేదు. నేతలు, అధికారుల అలసత్వం ఫలితంగా తాజాగా మరో కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇంటి పెద్ద గల్లంతై ఆచూకీ లభించక టెన్షన్‌ పడుతోంది. ఆగూరు పంచాయతీ రెల్లిగూడెం, సారాడవలస, మల్లెడువలస, సంగంగుడ్డి వలస, గూడెం గ్రామాల ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న కష్టాలివీ..

మెంటాడ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మెంటాడ మీదుగా ప్రవహించే చంపావతి నదికి పశ్చిమాన ఆగూరు పంచాయతీతోపాటు ఐదు శివారు గ్రామాలున్నాయి. వేసవిలో ఇబ్బందులు లేనప్పటికీ వర్షాకాలంలో చంపావతి పొంగిదంటే ఆయా గ్రామాల వెన్నులో వణుకు మొదలవుతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వరద తగ్గుముఖం పట్టేవరకు స్వీయ నిర్భంధం పాటిస్తుంటారు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంలో అడుగుపెట్టలేని దుస్థితి వారిది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాంతకమని తెలిసినా పీకల్లోతు ప్రవాహంలో మెంటాడ వచ్చి పచారీ సామాగ్రి, ఇతర అవసరాలు తీర్చుకొని తిరిగి వెళ్తుంటారు. క్షేమంగా ఇళ్లకు చేరేవరకు వారికి టెన్షనే. ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తితే మృత్యువును ఆహ్వానించడం మినహా వేరే గత్యంతరం లేదు. నదిదాటే వీలులేక గతంలో ప్రాణనష్టం జరిగిన సందర్భాలెన్నో. విధిలేని పరిస్థితుల్లో చావుకు ఎదురెళ్లడం వారికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో జలసమాధి అయినవారెందరో. తాజాగా పశువుల కాపరి చల్లకృష్ణ గల్లంతయ్యారు. ఇంకా ఆయన ఆచూకీ లభించలేదు. బుధవారం జగన్నాధపురం వద్ద పైపు కల్వర్టు సమీపంలో ఇద్దరు వ్యక్తులు కొంతదూరం కొట్టుకుపోయి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏటా వర్షాకాలంలో పశుసంపదను కూడా చంపావతి బలిగొంటోంది.

- రెల్లుగూడెం సహా పలు శివారు గ్రామాలు చంపావతి నదిని ఆనుకునే ఉన్నందున చాలాసార్లు నదినీరు ఊళ్లలోకి వచ్చి స్థానికులను కంటికి కునుకు లేకుండా చేస్తోంది.గండం నుంచి గట్టెకించాలని వారు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

- సాధారణ ప్రవాహ సమయంలో నదిని దాటేందుకు గ్రామస్థులు సిమెంట్‌ కరెంటు స్తంభాలను నదికి రెండువైపులా అడ్డంగా వేసి రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదుపుతప్పి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన చోట పడిపోతే ఆ ఊబినుంచి బయటపడలేక మృత్యువాత పడుతున్నారు.

- వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వాలకు ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ అంచనా వ్యయం పెరిగిందని ఒకసారి, తగ్గిందని ఒకసారి... ల్యాండ్‌ సేకరణకు ఆటంకాలు ఇంకోసారి ఇలా ప్రయత్నాలు ప్రతిపాదనలు దశలోనే ఆగిపోయాయి. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పీడిక రాజన్నదొర సైతం కినుక వహించారు.

- ఇన్నాళ్లూ ఓపికపట్టిన ఆయా గ్రామాలు మంగళ, బుధవారాలనాటి పరిణామాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధంచేస్తామని కూడా ఖరాకండిగా చెబుతున్నారు.

నలుగురిని మింగేసిన చంపావతి

ఆగూరు మల్లేడవలస మధ్య(రిజర్వాయర్‌ ఆనుకున్న ప్రాంతంలో)లో పదిహేనేళ్లలో నది నలుగురిని మింగేసింది. పైల అప్పలస్వామి, రాళ్ళపల్లి లక్ష్మి, పల్లి అప్పలస్వామి, చించుల లక్ష్మి నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

కుంచించుకుపోతున్న చంపావతి

చంపావతి నది కుంచించుకుపోతోంది. ఆండ్ర నుంచి భోగాపురం వద్ద సముద్రంలో కలుస్తున్న వరకు నది ఇరువైపులా ఆక్రమణకు గురయ్యింది. పంట పొలాలు ఏర్పాటు, భవన నిర్మాణాలు జరిగిపోయాయి. అంతటితో ఆగకుండా నిత్యం వేలాది నాటు బండ్లు, వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు.

ఆచూకీ లభించని పశువుల కాపరి

మెంటాడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చంపావతి నదిలో మంగళవారం గల్లంతైన మెంటాడ గ్రామానికి చెందిన పశువుల కాపరి చల్లా కృష్ణ(43) ఆచూకీ లభించలేదు. చింతలవలస ఐదో బెటాలియన్‌ నుంచి వచ్చిన ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం రోజంతా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రిజర్వ్‌ ఎస్‌ఐ కె.భాస్కరరావు నేతృత్వంలో 16మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి చంపావతిలో దాదాపుగా కిలోమీటరు పొడవునా జల్లెడ పట్టారు. ఆచూకీ కోసం విరామం లేకుండా శ్రమించారు. సాయంత్రం చీకటిపడేవరకు గాలింపు కొనసాగించారు. ఫలితం లేకపోయింది. గురువారం గాలింపు కొనసాగిస్తామని ఎస్‌ఐ భాస్కరరావు చెప్పారు.

-------------

Updated Date - Sep 25 , 2025 | 12:08 AM