Share News

If It Collapses… కూలితే.. అంతే!

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:13 PM

If It Collapses… That’s It! మార్కొండపుట్టి సమీపంలో ఉన్న చిట్టగెడ్డపై వంతెన శిథిలావస్థకు చేరింది. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వంతెన మధ్య భాగంలో భారీ గొయ్యి ఏర్పడడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళన చెందు తున్నారు.

If It Collapses… కూలితే.. అంతే!
చిట్టగెడ్డ వంతెన మధ్యలో ఏర్పడిన భారీ గొయ్యి

  • బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

  • ఆందోళనలో 20 గిరిజన గ్రామాల ప్రజలు

మక్కువ రూరల్‌, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): మార్కొండపుట్టి సమీపంలో ఉన్న చిట్టగెడ్డపై వంతెన శిథిలావస్థకు చేరింది. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వంతెన మధ్య భాగంలో భారీ గొయ్యి ఏర్పడడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళన చెందు తున్నారు. 1996లో పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు రూ.ఆరు లక్షలతో చిట్టగెడ్డపై కాజ్‌వే నిర్మించారు. అయితే కాలక్రమంలో ఈ వంతెనపై వాహన రాకపోకలు పెరిగాయి. నంద, ఘైౖశిల, తుండ గ్రామాల నుంచి పామాయిల్‌, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలను భారీ వాహనాల ద్వారా ఈ మార్గం గుండానే తరలిస్తుంటారు. మరోవైపు తుపాన్లు, భారీ వర్షాల కారణంగా వంతెన పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రూటులో నిత్యం తిరిగే వాహనాలు కాజ్‌వేపై గొయ్యిలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో మార్కొండపుట్టి, తుండ, నంద, మావుడి పంచాయతీలకు చెందిన 20 గిరిజన గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మార్గంలో మినీ వంతెన నిర్మించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై పార్వతీపురం ఐటీడీఏ ఏఈ పీవీ సత్యనారాయణను వివరణ కోరగా.. ‘చిట్టగెడ్డపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ’ అని తెలిపారు.

Updated Date - Dec 06 , 2025 | 11:13 PM