అందుబాటులోకి వస్తే.. ఇక్కట్లు తప్పినట్లే!
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:47 PM
జిల్లాలో మల్టీ పర్పస్ ఫెసిలిటి సెంటర్లు (ఎంపీఎఫ్‌సీ) నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.
- శరవేగంగా ఎంపీఎఫ్‌సీల నిర్మాణం
- జిల్లాలో 20 చోట్ల ఏర్పాటుకు శ్రీకారం
- ఇప్పటికే 11 చోట్ల పూర్తి
- రైతుల పంటలను నిల్వ చేసుకునే అవకాశం
జియ్యమ్మవలస, ఆగస్టు28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మల్టీ పర్పస్ ఫెసిలిటి సెంటర్లు (ఎంపీఎఫ్‌సీ) నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. పీఏసీఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది రూపాయలతో వాటి పనులు చేపడుతున్నారు. 500 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచుకునే విధంగా గోడౌన్లు నిర్మిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రైతుల సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ప్రధానంగా అధిక దిగుబడులు వచ్చి సరైన గిట్టుబాటు ధర రాని సమయంలో ఆ పంటలను ఎంపీఎఫ్‌సీలలో నిల్వ ఉంచుకోవచ్చు. ఒకవేళ పంట తడిసిపోతే దానిని పక్కనే ఉన్న ప్లాట్ ఫార్మ్‌పై ఆరబెట్టుకొని ఆ తరువాత గోడౌన్‌ల్ ఉంచొచ్చు. పీఏసీఎస్‌లలో సభ్యులుగా ఉన్న వారు మాత్రమే కాదు రైతులెవరైనా ఇందులో పంటలను ఉంచుకోవచ్చు. ఈ గోడౌన్లను ఒక వ్యక్తికి గాని, సంస్థకు గాని అద్దెకు లేదా లీజుకు ప్రభుత్వం ఇస్తుంది. ఇందుకోసం సంబంధిత పీఏసీఎస్ సీఈవోను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 15 మండలాల పరిధిలో 42 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. మొత్తంగా 49 వేల మంది సభ్యులు (రైతులు) ఉన్నారు. రెండు పీఏసీఎస్‌ల పరిధిలో ఒక్కో మల్టీ పర్పస్ ఫెసిలిటి సెంటర్ (పీఎంఎఫ్‌సీ) నిర్మించేందుకు 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ. 43 లక్షలకు పైగా మంజూరు చేసింది. అయితే పనులు మాత్రం నత్తనడకన జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణాలు ఊపందుకున్నాయి.
జిల్లాకు మంజూరైన 20 ఎంపీఎఫ్‌సీలలో బలిజిపేట మండలం అజ్జాడ, గళావలి, పలగరలో రెండు చోట్ల, సీతానగరం మండలంలో బూర్జ, ఆర్‌వీ పేట, గెడ్డలుప్పిలలో మంజూరు చేశారు. కొమరాడ, జియ్యమ్మవలస మండలంలో చినమేరంగి, గరుగుబిల్లి మండలంలో రావివలస, వీరఘట్టం, పాలకొండలో రెండేసి చొప్పున, ఆర్‌బీఆర్ పేట, అర్ధలి, బామిని, బత్తిలి గ్రామాల్లో, మక్కువ, పార్వతీపురం, బందలుప్పి గ్రామాల్లో ఎంపీఎఫ్‌సీలు మంజూరు చేశారు. రూ. 823.41 కోట్లు కేటాయించారు.
ఆర్‌బీఆర్ పేట, కొత్తవలస, ఎం.సింగుపురం, లోవిడి లక్ష్మీపురం , సంతనర్సిపురం, యు. వెంకమ్మపేట, కొమరాడ, బెల్లుముడ, లివిరి, అజ్జాడలో ఎంపీఎఫ్‌సీల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. పలగర, గళావిలిలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇంకా ఏడు భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పార్వతీపురం, కవిరిపల్లిలో సూపర్ స్ట్రక్చర్ లెవెల్‌లో, బందలుప్పి, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, బలిజిపేట, సీతానగరం మండలాల్లో భవనాలు బేస్‌మెంట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇంతవరకు రూ. 469.52 కోట్లు పనులు జరగ్గా రూ. 454.02 కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 369.39 కోట్లు విలువైన పనులు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పంట చేతికి రానున్న నేపథ్యంలో త్వరగా వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
రెండు నెలల్లో పూర్తి చేస్తాం
జిల్లాకు 20 ఎంపీఎఫ్‌సీలు మంజూరవగా ఇంతవరకు 11 భవన నిర్మాణాలు పూర్తి చేశాం. ఈ రెండు నెలల్లో మిగిలిన భవన నిర్మాణాలు పూర్తి చేస్తాం.
- పి.శ్రీరామ్మూర్తి, డీసీవో, జిల్లా కోఆపరేటివ్ సొసైటీస్, పార్వతీపురం మన్యం