Straight to Hospital ఆదమరిస్తే.. ఆసుపత్రికే!
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:30 PM
If Ignored… Straight to Hospital జియ్యమ్మవలస మండలంలో ఎం.అల్లువాడ - తుంబలి గ్రామాల ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనున్న భారీ గుంతల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతు పనుల్లో భాగంగా తవ్వి వదిలేసిన బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది
మూడేళ్లు గడిచినా.. పూడ్చలే!
ప్రమాదం పొంచి ఉన్నా.. పట్టించుకోని ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు
ఆందోళనలో వాహనదారులు
జియ్యమ్మవలస, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలంలో ఎం.అల్లువాడ - తుంబలి గ్రామాల ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనున్న భారీ గుంతల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇటువైపు రాకపోకలు సాగించలేకపోతున్నారు. వాస్తవంగా టవర్ల మరమ్మతు పనుల్లో భాగంగా మూడేళ్ల కిందట బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు ఎం.అల్లువాడ - తుంబలి గ్రామాల రోడ్డు పక్కన నాలుగైదు పెద్ద పెద్ద గుంతలు తవ్వారు. కనెక్షన్లకు మరమ్మతులు చేసేసి చేతులు దులుపుకున్నారు. కానీ వాటిని పూడ్చకుండా అలానే వదిలేశారు. ఏడు నుంచి తొమ్మిది అడుగుల లోతుతో ఒక్కో గుంత ఉండడంతో ఇటువైపుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోడ్డు పక్కనే 50 మీటర్ల పరిధిలో మలుపుల వద్ద ఉన్న ఈ గుంతల చుట్టూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో అవి అంతగా కనిపించడం లేదు. ఏ వాహనమైనా అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్తే.. ఇక అంతే పరిస్థితి. నేరుగా ఆసుపత్రికి చేరుకోవాల్సిందే. వాహనాలు క్రాస్ అయితే భారీ ప్రమాదం తప్పదు. 17 పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు నిత్యం ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రధాన రహదారికి ఆనుకుని పెద్ద పెద్ద గుంతలున్నా.. ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ప్రమాదం సంభవించకముందే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ సుశీలను వివరణ కోరగా.. ‘ఎం.అల్లువాడ - తుంబలి గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భారీ గోతులతో ఇబ్బందికరమే. ఈ విషయం బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు తెలియజేశాం. మరోసారి వారికి చెప్పి గోతులను పూడ్చే చర్యలు తీసుకుంటాం. ’ అని తెలిపారు.