If Encouraged… ప్రోత్సహిస్తే.. సిరుల పంటే!
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:24 AM
If Encouraged… A Harvest of Wealth! పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని కొండ శిఖర ప్రాంతాలు కాఫీ పంట సాగుకు ఎంతో అనుకూలం. తోటల పెంపకానికి గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నా.. ప్రోత్సాహం మాత్రం కొరవడుతోంది. దీంతో వారు పోడు వ్యవసాయం, జీడి తోటలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఇప్పటికే పాచిపెంట, సాలూరు మండలాల్లో తోటల పెంపకం
గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక అవస్థలు
దృష్టి సారించని గత వైసీపీ సర్కారు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
చొరవ చూపితే.. పెరగనున్న సాగు విస్తీర్ణం
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు3(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని కొండ శిఖర ప్రాంతాలు కాఫీ పంట సాగుకు ఎంతో అనుకూలం. తోటల పెంపకానికి గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నా.. ప్రోత్సాహం మాత్రం కొరవడుతోంది. దీంతో వారు పోడు వ్యవసాయం, జీడి తోటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే తెగుళ్లు, గిట్టుబాటు ధర రాక ఏటా నష్టాలను చవి చూస్తున్నారు. మరికొందరు ఉపాధి కోసం వలస బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో కాఫీ తోటల పెంపకం చేపడితే గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు దృష్టి సారించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
రాష్ట్ర కాఫీ బోర్డు బృందం 1994లో జిల్లాలో పర్యటించింది. ఈప్రాంత వాతావరణం, శీతోష్ణ పరిస్థితులు కాఫీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించింది. గుమ్మలక్ష్మీపురం మండలం గోయిపాక, తాడికొండ కొండపై వంగర, కేసర, డోలుకొన తదితర గ్రామాలు, కురుపాం మండలం జరడ తదితర ఆరు పంచాయతీలు, పాచిపెంట మండలంలోని రెండు పంచాయతీలు, సాలూరులోని కొండ శిఖర గ్రామాలు కాఫీ సాగుకు అనువైనవిగా గుర్తించారు. దీనిపై అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే పంట ప్రోత్సాహకానికి పార్వతీపురం ఐటీడీఏకు నిధులు రాలేదు. అప్పటి అధికారులు కాఫీ సాగుకు తగిన ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పార్వతీపురం ఐటీడీఏపై మాత్రం దృష్టి సారించకపో వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పాచిపెంట మండలం సతాబి, తంగాలం గిరిశిఖర గ్రామాల్లో సుమారు పది ఎకరాల్లో, సాలూరు మండలం కొఠియా ప్రాంతాల్లోనూ కాఫీ సాగు చేపడుతున్నారు. అయితే మార్కెట్ సౌకర్యం, అధికారుల ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వారు పాడేరు, అనంతగిరికి పంటను తీసుకెళ్లి విక్రయించాల్సి వస్తోంది. వాస్తవంగా కాఫీ తోటలు వేసిన మూడేళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది. ఎకరాకు 300 కేజీల వరకు దిగుబడి వస్తుంది. ఏడాదికి రూ.లక్ష పైనే ఆదాయం వస్తుందని గిరిజన రైతులు చెబుతున్నారు. జీసీసీ ఆధ్వర్యంలో పంటను కొనుగోలు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. సబ్సిడీపై పరికరాలు, గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటనలకే పరిమితమైంది. దీంతో గిరిజన రైతులంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ‘మన్యంలో కాఫీ తోటల పెంపకానికి ఐటీడీఏ, కాఫీబోర్డు వారు ప్రోత్సహించాలి. కాఫీ విత్తనాలు, ఎరువులు, సాగు పరికరాలు ఉచితంగా పంపిణీ చేయాలి. గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించాలి.’ అని రైతులు కోరుతున్నారు.
చిగురిస్తున్న ఆశలు
ఇటీవల కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కొండ శిఖర గ్రామాల్లో కాఫీ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. దీంతో గిరిజన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ‘ఇటీవల కలెక్టర్ కాఫీ తోటలపై సమీక్షించారు. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటాం.’ అని మండల వ్యవసాయాధికారి పి.శంకరరావు తెలిపారు.