Share News

Lush and Green! నిర్మిస్తే.. సస్యశ్యామలమే!

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:27 AM

If Built, It Will Turn Lush and Green! దుగ్గేరు ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన సురాపాడు ఆనకట్ట స్థానంలో మినీ రిజర్వాయర్‌ నిర్మించాలనే రైతుల డిమాండ్‌ నెరవేరడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా వారి ఆశలు ఫలించడం లేదు.

  Lush and Green! నిర్మిస్తే..  సస్యశ్యామలమే!
పిచ్చిమొక్కలతో మూసుకుపోయిన సురాపాడు ఆనకట్ట హెడ్‌స్లూయిస్‌ పాయింట్‌

  • ఆ స్థానంలో మినీ రిజర్వాయర్‌ నిర్మించాలని రైతుల వేడుకోలు

  • మూడు వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు

  • కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా.. ఫలితం శూన్యం

మక్కువ రూరల్‌, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి) దుగ్గేరు ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన సురాపాడు ఆనకట్ట స్థానంలో మినీ రిజర్వాయర్‌ నిర్మించాలనే రైతుల డిమాండ్‌ నెరవేరడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా వారి ఆశలు ఫలించడం లేదు. దీనిపై వారు గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఏటా వరుణుడిపై ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపైనే ఆ ప్రాంత రైతులు ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..

దుగ్గేరుకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో సురాపాడు వద్ద అడారి గెడ్డపై 1954లో ఆనకట్టను నిర్మించారు. దీని ద్వారా దుగ్గేరు, మూలవలస, పనసభద్ర, ఎర్రసామంతవలస, చిమిడివలస, అడారు, బొడ్డుసామంతవలస, మార్కొండపుట్టి, జగ్గుదొరవలస, పెదవూటగెడ్డ గ్రామాల్లో 1,875 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే కాలక్రమంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం మూడు వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, అరటి, పామాయిల్‌ తదితర వాటిని పండిస్తున్నారు. ఆనకట్ట నుంచి సరఫరా అయ్యే నీరు పంటలకు చాలడం లేదు. దీంతో ఏటా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఆనకట్ట నిర్వహణను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇందుకవసరమైన నిధులు కూడా మంజూరు కావడం లేదు. దీంతో కాలువలో మధ్యలో నిర్మించిన కల్వర్టులు, కానాలు, మినీవంతెనలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి.

2014 - 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం సురాపాడు ఆనకట్ట పరిధిలో కాలువలు, డ్రాపుల మరమ్మతులు, సిల్టు తొలగింపు పనులకు నీరు-చెట్టు పథకం కింద కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో కొంతవరకు పనులు జరిగాయి. అయితే ఆనకట్ట కాలువ పరిధి మొత్తం అటవీ, ప్రాంతంలో ఉండడం వల్ల భారీవర్షాలకు అనేక చోట్ట గండ్లు పడ్డాయి. కాలువ కూడా మరమ్మతులకు గురైంది. కానాలు, డ్రాపులు ఎక్కడక్కడ పాడై కాలువ కింద భూములకు సాగునీరందడం లేదు. ఇదిలావుండగా ఆనకట్టలో హెడ్‌స్లూయిస్‌తో పాటు కాలువ మొత్తం తుప్పలు, డొంకలతో మూసుకుపోయింది. కాలువ మధ్యలో నిర్మించిన చిన్న, పెద్దకానాలు మరమ్మతులకు గురవగా.. సాగునీరు వృథాగా పోతోంది. సురాపాడులో ఎనిమిది గ్రామాల్లోని పెరిగిన ఆయకట్టుకు సంపూర్ణంగా సాగునీరందాలంటే నిధులు మంజూరు చేసి ఆనకట్టను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ ఏఈ అన్సర్‌వల్లీని వివరణ కోరగా.. ‘సురాపాడులో వివిధ పనులను చేపట్టేందుకు రూ.కోటీ పది లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Dec 22 , 2025 | 12:27 AM