Share News

Hostels Will Be Shut Down ప్రవేశాలు పెరగకుంటే.. వసతిగృహాలు మూసేస్తాం..

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:17 PM

If Admissions Don’t Increase… Hostels Will Be Shut Down జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పిల్లల ప్రవేశాలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రవేశాలు పెరగకుంటే వసతిగృహాల మూసివేత తప్పదన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 Hostels Will Be Shut Down ప్రవేశాలు పెరగకుంటే.. వసతిగృహాలు మూసేస్తాం..
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బాల వీరాంజనేయస్వామి

  • జిల్లాలో చేరికలపై అసంతృప్తి

పార్వతీపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పిల్లల ప్రవేశాలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రవేశాలు పెరగకుంటే వసతిగృహాల మూసివేత తప్పదన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో 800 మంది పిల్లలు చేరాల్సి ఉంది. ఇప్పటివరకు 534 మాత్రమే చేరారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్ల వసతిగృహాలు మూతపడ కూడదు. పాఠశాలలకు, అవసరమైతే గ్రామాలకు వెళ్లి పిల్లలను హాస్టళ్లలో జాయిన్‌ చేయించాలి. పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ట్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలి. త్వరలోనే విద్యార్థులకు కాస్మెటిక్‌ కిట్స్‌ అందిస్తాం. వసతి గృహాల్లో విషసర్పాలు ప్రవేశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నాం. ఎక్కడైనా విషసర్పాల వల్ల విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే వార్డెన్లపై కఠిన చర్యలు తప్పవు. జిల్లాలోని గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై రాజీపడొద్దు. జిల్లాలో ఎస్సీ వసతిగృహాల మరమ్మతులకు రూ.3కోట్లు మంజూరు చేశాం. హాస్టల్‌ ప్రాంగణంలో ఉండే పొదలను పంచాయతీ సిబ్బంది ద్వారా తొల గించాలి. వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచాలి. విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్‌ లేకుండా చూడాలి. వారికి అవసరమైన మేరకు మందులు ఇవ్వాలి. అనారోగ్యంతో బాధపడేవారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి పంపించొద్దు. త్వరలోనే ప్రతి హాస్టల్‌కు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ఇప్పటివరకు స్టాక్‌లో ఉన్న పాత బియ్యాన్ని వెనక్కి ఇచ్చి.. ఫోర్టిఫైడ్‌ నాణ్యమైన రైస్‌ను వసతిగృహాలకు తీసుకెళ్లాలి. విద్యార్థులకు దుప్పట్లు, కంచాలు, గ్లాసులు, పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో అందించాలి. కుక్‌లకు శిక్షణ ఇవ్వాలి. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లా సంక్షేమ ఆరోగ్యాధికారిని నియమించాలి. మలేరియా, అనీమియా, న్యూట్రిషన్‌ సమస్యలపై దృష్టిసారించి మంచి వైద్యం, పోషకాహారం అందించాలి. త్వరలోనే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లు ప్రారంభిస్తాం. మరికొంతమంది అభ్యర్థులకు లాంగ్‌టర్మ్‌ శిక్షణ కూడా అందిస్తాం. ఇప్పటికే అనేక మంది ఎంబీబీఎస్‌ తదితర ఉన్నత విద్యలో సీట్లు సాధించారు. ఇంటర్‌ పాసైన విద్యార్థులకు జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి ఆ దేశంలో ఉపాధి కల్పిస్తాం.’ అని తెలిపారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో వసతిగృహం నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తు న్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జేసీ శోభిక, సబ్‌ కలెక్టర్‌ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత, ఉమ్మడి జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారులు అప్పన్న, అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, వసతిగృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:17 PM