Athletes క్రీడాకారులను గుర్తించాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:56 PM
Identifying Athletes ‘క్రీడా రంగంలో కేవలం తాత్కాలిక ఉత్సాహం సరిపోదు.. ఐదేళ్లపాటు స్థిరమైన పట్టుదలతో ఉండే వారినే అసలైన క్రీడాకారులుగా గుర్తించాలి.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘క్రీడా రంగంలో కేవలం తాత్కాలిక ఉత్సాహం సరిపోదు.. ఐదేళ్లపాటు స్థిరమైన పట్టుదలతో ఉండే వారినే అసలైన క్రీడాకారులుగా గుర్తించాలి.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న క్రీడా పాఠశాల విషయంపై చర్చించారు. ఇందులో చేర్చుకునే క్రీడాకారుల ఎంపిక, ఇతరత్రా అంశాలపై సలహాలు, సూచనలు అందించారు. ‘ క్రీడా వ్యవస్థ అనేది వ్యక్తిపై ఆధారపడి ఉండరాదు. అధికారులు మారినా నిరంతరం విద్యార్థులకు శిక్షణ కొనసాగాలి. విద్యార్థుల్లో సెల్ఫ్ డిసిప్లిన్ పెంపొందించడమే లక్ష్యం. నియోజకవర్గాల్లో పాఠశాలలను గుర్తించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అనంతరం ఎంపికలు చేయాలి. పతకాలు సాధించే 20మంది పక్కా క్రీడాకారులు ఉంటే చాలు.’ అని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఈవో బ్రహ్మాజీరావు, డీఎస్‌డీవో కె.శ్రీధర్‌రావు, పీఈటీలు ఉన్నారు.
న్యాయం చేయడమే లక్ష్యం
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయడమే విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కమిటీ సమావేశంలో బాధితుల ఫిర్యాదులు, కేసుల్లో పురోగతి, విచారణ తీరు, నిందితులకు శిక్ష పడేలా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. బాధితులకు ప్రభుత్వ పథకాలు అందించాలని, చట్టపరమైన రక్షణ కల్పించాలని కలెక్టర్ సూచిం చారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ .. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏఎస్పీ మనీషా తదితరులు పాల్గొన్నారు.